సీఎం జగన్ కు బిగ్ రిలీఫ్ - 2024కి కలిసొచ్చేనా : మూడు ప్రాంతాల్లోనూ టీడీపీ ఫ్యూచర్..!?
ఏపీ సీఎం జగన్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. మధ్యంతర ఉత్తర్వులే అయినా..ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ ఈ ఉత్తర్వులు భారీ ఉపశమనం ఇవ్వటం ఖాయం. మూడు రాజధానుల విషయంలో తొలి నుంచి పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. అదే సమయంలో రాజకీయంగా టీడీపీని ఫిక్స్ చేసారు. చంద్రబాబు తో సహా ప్రతిపక్షాలు అమరావతి మాత్రమే రాజధానిగా చెబుతూ అదే స్టాండ్ మీద కొనసాగారు.
అటు ఉత్తరాంధ్ర..ఇటు రాయలసీమలో మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు వాయిస్ వినిపిస్తే..టీడీపీ నేతలు మాత్రం ఆ రెండు ప్రాంతాల్లోనూ అమరావతి కే తమ మద్దతు అని స్పష్టం చేసారు. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులతో పాటుగా.. న్యాయస్థానంలో జరిగిన వాదనలు.. న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా కనిపిస్తున్నాయి.

సుప్రీం మధ్యంతర ఉత్తర్వులతో..
ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో ఏడు డైరెక్షన్స్ తో తీర్పు ఇచ్చింది. ఆరు నెలల కాలంలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది. అదే విధంగా ఏపీ అసెంబ్లీకి రాజధాని మార్చే అధికారం లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు పైన సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన విచారణ చేసిన హైకోర్టు రాజధానిని సమయం నిర్దేశించి పూర్తి చేయటం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే విధంగా శాసన వ్యవస్థకు అధికారం లేదని చెప్పటాన్ని ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కొన్ని స్పష్టమైన ప్రశ్నలు సంధించింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో అయిదు అంశాల పైన ఏపీ ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తూ సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, రాజకీయంగా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పైన చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఎవరికి కలిసి వస్తుందనే అంశం పైన విశ్లేషణలు మొదలయ్యాయి. రాజధాని నిర్మాణానికి సంబంధించి నిర్దేశిత సమయం పైన స్టే ఇచ్చారని.. మిగిలిన సాంకేతిక..న్యాయపరమైన అంశాల పైన తదుపరి విచారణలో స్పష్టత వస్తుందని అమరావతి తరపు న్యాయవాదులు చెబుతున్నారు.

రాజకీయంగా పట్టు బిగించిన సీఎం జగన్..
రాజధానుల కేసు కోర్టులో ఉన్నా..మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆ అంశాన్ని లైవ్ లోనే ఉంచింది. విశాఖ గర్జన..సీమ గర్జన పేరుతో విశాఖ..కర్నూలులో ర్యాలీలకు మద్దతుగా నిలిచిందది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులోనూ అమరావతికే మద్దతు ఉందంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంలో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు లభించదనే నమ్మకంతో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. కానీ, తుది తీర్పు కాకపోయినా.. కోర్టులో జరిగిన వాదనలు పరిశీలించిన తరువాత తమకే తీర్పు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వంలోని ముఖ్యులు అంచనా వేస్తున్నారు.
అదే సమయంలో రాజధానుల నిర్ణయాధికారం ప్రభుత్వానికి ఉందంటూ వైసీపీ కొద్ది రోజులుగా వాదిస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు పై విచారణ సమయంలో సుప్రీం న్యాయమూర్తులు వీటిని పరిగణలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అమరావతి విషయంలో ప్రభుత్వం తుది తీర్పు వరకు వేచి చూసే ధోరణితోనే ఉంది. వికేంద్రీకరణ తమ విధానమని.. న్యాయస్థానంలో తుది తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రాజకీయంగా మూడు ప్రాంతాల్లోనూ...
ఇక, ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులతో అమరావతితో పాటుగా సీమ - ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రాజకీయ బలాబలాలపైన చర్చ జరుగుతోంది. తుది తీర్పు ఎలా ఉన్నా..ఈ లోగా రాజకీయంగా మైండ్ గేమ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రాజధాని అమరావతి నుంచి మార్చాలంటే మూడు రాజధానుల వ్యవహారంలోనూ రిఫరెండంకు వెళ్లాలని టీడీపీ డిమాండ్ చేసింది.
ఇక, ఉత్తరాంధ్ర - రాయలసీమలోని టీడీపీ నేతలు సుప్రీం తుది తీర్పు వచ్చే వరకూ రాజధాని వివాదం పైన మౌనంగా ఉండే అవకాశం ఉంది. ఇక, ఇప్పుడు అమరావతి పరిధి రాజకీయంగానూ కలిసి వస్తుందని ఎక్కువగా టీడీపీ ఆశలు పెట్టుకుంది. దీంతో, తుది తీర్పు పైన ప్రభుత్వంతో పాటుగా.. టీడీపీలోనూ టెన్షన్ కనిపిస్తోంది. రాజధాని విషయంలో హైకోర్టులో ప్రభుత్వానికి షాక్ తగలగా.. ఇప్పుడు ఈ తీర్పుతో రిలీఫ్ లభించింది. ఇక, తుది తీర్పు తరువాతనే ఈ మొత్తం వ్యవహారంపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications