తిరుమల శ్రీవారికి నిత్యాలంకరణలో వినియోగించే పూల మాలల వివరాలు- వాటి విశేషాలు
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 69,842 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 28,234 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.18 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది.
అలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిర్వహించే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనది. పవిత్రమైన తిరువాయ్ మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారు. స్వామివారి ఆపాదమస్తకం డజనుకు పైగా వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలు, అరడజనుకు పైగా పత్రాలతో సర్వాంగ సుందరంగా మాలలను తయారు చేస్తారు. రోజూ రెండుసార్లు వాటిని మార్చుతారు.

శిఖామణి..
కిరీటం మీది నుంచి రెండు భుజాల మీది వరకు అలంకరించే ఒకే ఒక దండను 'శిఖామణి' అంటారు. ఇది ఎనిమిది మూరల దండ.
సాలిగ్రామ మాల..
శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉండే సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరించే పొడవైన పూలమాలలు. ఇవి రెండుమాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు.
కంఠసరి..
ద్వి భజాల మీదికి అలంకరించే దండ. ఒకటి మూడున్నర మూరలు.
వక్షస్థల లక్ష్మి..
శ్రీవారి వక్షఃస్థలంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవికి రెండు దండలు. ఒక్కొక్కటి ఒకటిన్నర మూర.
శంఖుచక్రం..
శంఖుచక్రాలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒక మూర.
కఠారిసరం..
శ్రీస్వామివారి బొడ్డునవున్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి. రెండు మూరలు.
తావళాలు..
రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వ్రేలాడదీసే మూడు దండలు.
1. మూడు మూరలు, 2. మూడున్నర మూరలు, 3. నాలుగు మూరలు.
తిరువడి దండలు..
శ్రీస్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్క మూర.
ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీస్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, పై పేర్కొన్న మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు.












Click it and Unblock the Notifications