కోడలిని చంపిన అత్త అరెస్టు: గన్నేరు పప్పుతో హత్య
విజయవాడ: తన కొడుకును తనకు కాకుండా చేస్తుందనే అక్కసుతో ఓ మహిళ కుట్ప పన్ని తన కోడలిని చంపేసింది. విషమిచ్చి మత్తులో జారుకున్న కోడలిని గొంతు బిగించి చంపేసింది. ఆ హత్యను ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసులు కూడా తొలుత ఆత్మహత్యగానే భావించినా అసలు నిజం దర్యాప్తులో వెల్లడికావడంతో అత్తతోపాటు మిగిలిన కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు.
విజయవాడలోని ఆటోనగర్ గేటు సమీపంలోని రోడ్డు పక్కనే ఉన్న బస్టాపుకు ఆనుకుని గుడిసెల్లో నివాసం ఉంటున్న దాసరి గోదావరి తన కుమారుడు వెంకయ్యకు ఇటీవలే తిరుపతమ్మ (20) అనే యువతితో పెళ్లి చేసింది. కాని పెళ్లయినప్పటి తన కొడుకు తన మాట వినడంలేదని, కొడుకు సంపాదించి తీసుకువచ్చిన సొమ్మును కూడా భార్య చేతికిస్తున్నాడని కోడలిపై అక్కసు పెంచుకుంది.

కోడలిపై ద్వేషం ముదిరిపోయిన క్రమంలో ఎలాగైనా అమెను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసి కుమార్తె చెరుకూరి పూజ, బంధువు బిక్షాలుతో పథక వ్యూహరచన చేసింది. ఈ నెల 21వ తేదీన కోడలు తిరుపతమ్మ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే మానసిక వ్యధతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు అందరినీ నమ్మించారు. పోలీసులకు కూడా ఈ విధంగానే ఫిర్యాదు చేయగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించారు.
కాగా, పంచనామా సమయంలో అనుమానాలు వ్యక్తం కావడంతో నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు తమ శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ఆ రోజు 21వ తేదీన కోడలికి గన్నేరు పప్పు నూరి కిళ్ళీలో కలిపి ఇచ్చింది. అది తిన్న తిరుపతమ్మ మగతలోకి జారుకోగా కూతురు, బంధువు బిక్షాలుతో కలిసి చున్నీతో మెడ బిగించి చంపేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications