ఆస్పత్రికి సోదరిని చూడ్డానికి వచ్చి, లిఫ్ట్ ఎక్కబోయి మహిళ మృతి
నెల్లూరు: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సోదరిని చూడటానికి ఆస్పత్రికి వచ్చి లిఫ్ట్ ఎక్కబోయి ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో ఆదివారం ఓ మహిళ మృతి చెందింది. ఇందుకు రెయిన్‌బో ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమంటూ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం బంగారుపల్లెకు చెందిన మృతురాలు భాగ్యమ్మ (54) బంధువులు, బీజేపీ, సీపీఐ నేతలు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు.
భాగ్యమ్మ తన చెల్లెలు పెంచలమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా చూసేందుకు వచ్చారు. ఈ నేపధ్యంలో ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఆస్పత్రి నాలుగో అంతస్తు నుంచి కిందకు దిగేందుకు లిఫ్ట్ వద్దకు చేరుకుంది.
లిఫ్ట్ ఎక్కేందుకు ముందు ఉన్న డోర్ తెరిచింది. అయితే, అక్కడ లిఫ్ట్ లేదు. అయితే, ఆ విషయాన్ని గుర్తించకుండా భాగ్యమ్మ కాలు లోపలికి పెట్టడంతో ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది.

విషయం తెలుసుకున్న బీజేపీ, సీపీఐ నేతలు ఆస్పత్రికి చేరుకుని బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. భాగ్యమ్మ మృతికి ఆస్పత్రి నిర్వాహకుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. లిఫ్ట్ లేకుండానే ముందు డోర్ ఎలా తెరుచుకుంటుందంటూ ప్రశ్నించారు.
మరమ్మతులు చేపట్టని లిఫ్ట్‌లను ఎలా అందుబాటులో ఉంచారంటూ నిలదీశారు. ఆఖరికి ఆస్పత్రి యాజమాన్యం తప్పిదాన్ని ఒప్పుకొని నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో వారు ఆందోళన విరమించారు.












Click it and Unblock the Notifications