కోడలిని చంపి, పూడ్చిపెట్టారు: ఎవరితోనే వెళ్లిపోయిందని అత్తామామల ఫిర్యాదు
కృష్ణా: జిల్లాలోని నాగాయలంక మండలం బర్రంకులలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అని కూడా చూడకుండా కొడుకు భార్యను హత్య చేశారు అత్తామామలు. అనంతరం ఎవరికి తెలియకుండా గ్రామ సమీపంలోని కాలువ దగ్గర పాతిపెట్టారు.
విషయం బయటికి రాకుండా ఉండేందుకు తమ కోడలు ఎవరితోనో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తమ కూతురు కనిపించడం లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో 3నెలల క్రితం జరిగిన ఈ హత్య వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. బర్రంకుల గ్రామానికి చెందిన కెమెరామెన్ వంశీ, వరలక్ష్మి ఇద్దరు దంపతులు. కాగా, వరలక్ష్మి 3 నెలల గర్భవతిగా ఉండగా మూడు నెలల క్రితం ఆమె అత్తామామలు ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత గ్రామ సమీపంలోని ఓ కాలువ వద్ద ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు.
ఎవరికీ అనుమానం రాకుండా తమ కోడలు ఎవరితోనో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే తమ కూతురు కనిపించడం లేదంటూ ఇటీవల వరలక్ష్మి తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.
ఈ విషయం తెలుసుకున్న వరలక్ష్మి అత్తామామలు ఆమె మృతదేహాన్ని వేరొక చోటికి మార్చేశారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు వరలక్ష్మి అత్తామామలే నిందితులని తేల్చారు. దీంతో వరలక్ష్మి అత్తామామలను, ఆమె భర్త వంశీని అదుపులోకి తీసుకున్నారు.
వరలక్ష్మి మృతదేహం కోసం తవ్వకాలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications