అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని, ప్రియుడితో కలిసి మర్మాంగాలపై తన్ని....
హైదరాబాద్: తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఆరు నెలల కిందట ఆ హత్య జరిగింది. ఇన్‌స్పెక్టర్ కోత్వాల్ ఆ హత్యకు సంబంధించిన వివరాలను సోమవారంనాడు వెల్లడించారు.
హైదరాబాదులోని మియాపూర్ ఎస్‌విహెచ్ ప్లాజా ఫ్లాట్ నెంబర్ 405లో ముస్తాఖ్ హుస్సేన్ (32) భార్య అయేషా ఫాతిమా అలియాస్ పద్మావతితో కలిసి ఉండేవాడు. స్థానికంగా వ్యాపారం చేస్తూ జీవితం గడిపేవాడు.
నిరుడు సెప్టెంబర్ 24వ తేదీన హుస్సేన్ అతని ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. చందానగర్‌లో ఉండే హుస్సేన్ సోదరి తన్వీర్ సుల్తానా అయేషా ఫాతిమాపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర ఆధారాలను బట్టి కేసును ఛేదించారు.

ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్న ఫాతిమా అందులోనే డ్రైవర్‌గా పనిచేస్తున్న రత్లావత్ భాస్కర్‌తో వైవాహికేతర సంబంధం పెట్టుకుంది. అనుమానం వచ్చిన హుస్సేన్ భార్య ఫాతిమాతో గొడవ పడుతూ వచ్చాడు. దాంతో విసిగిపోయిన ఫాతిమా అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్ వేసింది.
సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి హుస్సేన్ నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు భాస్కర్‌ను ఫ్లాట్‌కు పిలిచింది. హుస్సేన్ కాళ్లను ఫాతిమా గట్టిగా పట్టుకోగా, భాస్కర్ అతని తలను గోడకేసి గట్టిగా కొట్టాడు. మర్మాంగంపై తన్నాడు. స్పృహ కోల్పోయిన హుస్సేన్ అక్కడికక్కడే మరణించాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఫాతిమాను, భాస్కర్‌ను సోమవారంనాడు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications