భద్రత డొల్లేనా?: చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో మావోయిస్టు నేత!
విజయవాడ: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలో మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది. విజయవాడకు సమీపంలో కృష్ణా నది ఆవలి వైపున గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే భూసేకరణ పూర్తికాగా తాత్కాలిక రాజధాని పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా, పరిపాలన సౌలభ్యం కోసం అక్కడికి సమీపంలోని తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని కృష్ణా కరకట్టలపై అప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న లింగమనేని గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. అక్కడే ఉంటున్న చంద్రబాబు.. విజయవాడ నుంచి పాలన సాగిస్తున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు నివాసానికి 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో ఓ మహిళా మావోయిస్టు సంచారం సంచలనంగా మారింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగి మహిళా మావోయిస్టు భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణక్కను అదుపులోకి తీసుకున్నారు.
ఆమె భర్త బాలస్వామి కూడా పోలీసులకు దొరికిపోయాడు. అనారోగ్యంతో సతమతమవుతున్న అరుణ... తాళ్లాయపాలెంలోని తన సోదరి ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోకి మహిళా మావోయిస్టు ఎంట్రీ ఇవ్వడంతో పోలీసులు ఆందోళనకు గురయ్యారు.

అనారోగ్యానికి చికిత్స చేయించుకునేందుకే ఆ మహిళా మావోయిస్టు వచ్చినప్పటికీ... చంద్రబాబు, ఇతర కేబినెట్ మంత్రులు నిత్యం సంచరించే ఆ ప్రాంతంలో పటిష్ట భద్రత ఉన్నా, నాలుగు రోజుల దాకా విషయం బయటకు పొక్కకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
కాగా, మావోయిస్టు నేత భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణక్కను, ఆమె సోదరి పద్మక్కను మంగళవారం గుంటూరు రూరల్, జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అరుణక్క పార్టీలో డిప్యూటీ కమాండర్‌గా కూడా వ్యవహరిస్తున్నారని తెలిసింది.
ఆమెపై మొత్తం 9 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తన సోదరి ఇంట ఉంటున్నట్లుగా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిని చుట్టిముట్టి అదుపులోకి తీసుకుని తమ వెంట తీసుకెళ్లారు. చత్తీస్‌గఢ్ ఏరియాలో పేరొందిన మావోయిస్టు నరసింహారావు అలియాస్ జగ్గన్న అరుణక్క భర్తగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications