అమరావతి నిర్మాణంలో కీలక మలుపు - కొత్త చరిత్ర..!!
అమరావతి నిర్మాణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి కోసం నిధుల సమీకరణ ప్రక్రియ వేగవంతం అయింది. అమరావతి రాజధానికి అత్యున్నతస్థాయి ప్రపంచ బ్యాంకు బృందం రాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానుంది. అమరావతి రాజధానికి ప్రాజెక్టుల వారీగా ఎంత మేర రుణం ఇవ్వగలుగుతామన్నది ఈ బృందం నిర్ణయిస్తుంది. రూ 15 వేల కోట్ల రుణ సమీకరణ లక్ష్యంగా చంద్రబాబు ఆ టీంకు ప్రాధాన్యతలు వివరించనున్నారు.
కీలక భేటీ
ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రతినిధులతో చంద్రబాబు ఈ రోజు సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు బ్యాంకుల ప్రతినిధులు తొలి విడతగా అమరావతిలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. నేటి నుంచి వారం రోజుల పాటు మరో విడత రాజధానిలో పర్యటన ఖరారైంది. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవుతున్నారు. అమరావతి నిర్మాణాల ప్రణాళికలు, లక్ష్యాలను చంద్రబాబు వారికి వివరించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి..నిధుల సమీకరణ దిశగా చర్చలు చేయనున్నారు.

రుణం దిశగా
కేంద్రం ఇప్పటికే అమరాతికి రూ 15 వేల కోట్లు రుణంగా ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచ బ్యాంకు టీం తొలి సారి చంద్రబాబుతో సమావేశమైన సమయంలో ప్రతిపాదనల పైన సమీక్ష చేసారు. అమరావతిలో ప్రస్తుత పరిస్థితులు..రానున్న కాలంలో ప్రభుత్వ ప్రణాళికలను చంద్రబాబు వివరించారు. ఈ రోజు జరిగే సమావేశంలో అమరావతిలో శాశ్వత ప్రభుత్వ కాంప్లెక్స్‌లో భాగంగా నిర్మించే సచివాలయ టవర్లు, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఎన్‌జీఓ, సెక్రటరీలు, జడ్జీల భవనాలు, ప్రభుత్వ టైప్ - 1, టైప్ - 2 భవనాలు, ఎల్‌పీఎస్ ఇన్ర్ఫా, ట్రంక్ ఇన్ర్ఫా, రాజధాని సంబంధిత ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్ర సమాచారాన్ని అందించనున్నారు.

రాజధాని ప్రాధాన్యత
అమరావతి రాజధానిని అంతర్జాతీయ నగర నిర్మాణం దిశగా ఏ విధంగా ప్రణాళిక రూపొందించారనేది చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. అమరావతిలో ఎంచుకున్న ప్రాధాన్యతలు, ఆర్థిక అవసరాల గురించి ఆయన సమగ్రంగా బృంద సభ్యులకు వివరించారు. ఈ కమిటీకి సీఆర్‌డీఏ నుంచి ఆయా ప్రాజెక్టుల వారీగా ఎంతెంత నిధులు అవసరమన్న లెక్కలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల వారీగా సీఆర్‌డీఏ కూడా రుణం ఎంత అవసరమన్న లెక్కలను కూడా సంబంధిత విభాగాలతో సిద్ధం చేసారు. అమరావతి రాజధానిలోని కీలక ప్రాజెక్టులకు లోన్ కాంపోనెంట్ ఎంతెంత ఇవ్వాలన్నది 14 మంది సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ నిర్ణయిస్తుంది.












Click it and Unblock the Notifications