డ్యాన్స్ చేసిన చంద్రబాబు, కెమెరాలో సింగపూర్ మంత్రి
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి సంబరాలను మంగళవారం విశాఖలో ప్రారంభించారు. సింగపూర్ వాణిజ్య శాఖ సహాయ మంత్రి ఈశ్వరన్, వాణిజ్య ప్రతినిధులతో కలిసి చంద్రబాబు మంగళవారం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు.
విమానాశ్రయం నుంచి వీరు నేరుగా కైలాసగిరి చేరుకున్నారు. అక్కడ సంక్రాంతి సంబరాలను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ ఏజెన్సీకి చెందిన థింసా కళాకారులతో కలిసి చంద్రబాబు కాసేపు నృత్యం చేశారు. సంప్రదాయక ఎడ్లబండ్లను ఆయన తిలకించారు. హరిదాసులతో చంద్రబాబు ముచ్చటించారు.
గంగరెద్దుల ప్రదర్శన, తప్పెటగుళ్లు, కోలాటం, కొమ్మదాసరి ప్రదర్శనలను చంద్రబాబు, సింగపూర్ బృందం తిలకించింది. అనంతరం గాలి పటాలను చంద్రబాబు ఎగరేసి, కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. తెలుగింటి సంప్రదాయ వంటలను చంద్రబాబు సింగపూర్ అతిథులకు రుచి చూపించారు. అరిసెలు, బూరెలు, బొబ్బట్లు, సున్నుండలను చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌కు తినిపించారు. వీటిని తిన్న సింగపూర్ ప్రతినిధులు అమితానందాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలను మంగళవారం విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై నిర్వహిస్తున్న వేడుకలకు చంద్రబాబు వస్తూ వస్తూనే కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రాంగణానికి వెళ్లి గిరిజనుల నుంచి డప్పు తీసుకుని వాయించారు.

అనంతరం, అరకు గిరిజన మహిళలు ప్రదర్శించిన థింసా నృత్యాన్ని తిలకించారు. థింసా నృత్యం గురించి సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌కు వివరించారు. స్వయంగా గిరిజన మహిళలతో కలిసి సీఎం చంద్రబాబు నృత్యం చేశారు. మంత్రులు, అధికారులు ఉత్సాహపరచడంతో చంద్రబాబు మరింత హుషారుగా వారితో కలిసి అడుగులు వేయడం చూసిన సింగపూర్ మంత్రి ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు.
అక్కడి నుంచి హరిదాసుల వద్దకు వెళ్లిన చంద్రబాబు వారితో మాట్లాడి, సంకీర్తనలు విన్నారు. తప్పెటగుళ్లు కళాకారుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి ఆ కళా రూపకం ప్రాధాన్యాన్ని సింగపూర్ మంత్రికి వివరించారు. గంగిరెద్దుల బృందం ప్రదర్శించిన విన్యాసాలను తిలకించారు. ఆ విన్యాసాలను ఈశ్వరన్ ఆసక్తికరంగా తన కెమెరాలో బంధించుకున్నారు. తర్వాత ఈశ్వరన్‌తో కలిసి చంద్రబాబు గాలిపటాలు ఎగురవేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలను ఎగుర వేస్తారని ఈశ్వరన్‌కు చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా కైలాసగిరి కొండపై నుంచి నగర అందాలను ఈశ్వరన్ తన కెమెరాలో బంధించారు. గొబ్బెమ్మల నృత్యాలను తిలకించి వారిని అభినందించారు. చివరగా సంప్రదాయ వంటకాల స్టాల్‌ను సందర్శించారు. స్టాల్‌లో గిరిజన ప్రాంతాల్లో పండిన పంటలను చూపిస్తూ.. వాటిలో పోషకాల గురించి వివరించారు. ఆ తర్వాత సంక్రాంతికి వండే వంటకాలను చంద్రబాబు వారికి వివరిస్తూ స్వయంగా రుచి చూశారు.












Click it and Unblock the Notifications