'ఏకమవుతున్న రాక్షసమూకలు, పట్టపగలే పరిటాల రవిని కాల్చి చంపారు'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వర రావులు ఆదివారం నిప్పులు చెరిగారు. చంద్రబాబును రాక్షసుడు అన్న జగన్ పెద్ద రాక్షసుడు అని దుయ్యబట్టారు.
అలాగే, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాపై జరిగిన దాడి విషయమై జగన్‌కు ఏం సంబంధమన్నట్లుగా అభిప్రాయపడ్డారు. అమిత్ షాను అడ్డుకుంటే ఆయన ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. జగన్ అధికారమదంతో పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే చంద్రబాబును రాక్షసుడు అంటున్నారన్నారు.

ఆ చరిత్ర వైయస్ రాజశేఖర రెడ్డిది
జగన్ పట్టిసీమపై సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నారని దేవినేని విమర్శించారు. ఒళ్లు కొవ్వెక్కి పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు అధికార పిచ్చి పట్టుకుందని, చిట్టి నగర్ సందులో చిట్టి జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. బాంబులు పెట్టి కొల్లేరును ధ్వంసం చేసిన చరిత్ర వైయస్ రాజశేఖర రెడ్డిది అన్నారు.

కాకాని పేరు పెడతాం
బెంజ్ సర్కిల్‌లో ఫ్లై ఓవర్ పిల్లర్ పనులు పూర్తయిన తర్వాత కాకాని వెంకట రత్నం విగ్రహాన్ని పునఃప్రతిష్టిస్తామని దేవినేని చెప్పారు. విగ్రహ తొలగింపుపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బెంజ్ సర్కిల్‌కు కాకాని పేరు పెడతామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బోటు ప్రమాదంపై ముగ్గురు సభ్యుల కమిటీ వేశామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

జగన్ క్షమాపణ చెప్పాలి
పట్టిసీమపై జగన్ చేసిన విమర్శలకు ఇప్పటికైనా సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పాదయాత్రలో పట్టిసీమ ఫలాలు ఆయనకు కనిపించలేదా అని ప్రశ్నించారు. పట్టిసీమ దండగ అన్న జగన్ అందుకు క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. పట్టి సీమ నీటితో చెరువులను నింపగలిగామన్నారు. జగన్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఆయనకే తెలియదన్నారు. పాదయాత్రలో జగన్ ఒక్క వినతిని అయినా స్వీకరించారా అని ప్రశ్నించారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు.

రాక్షసత్వంతో పట్టపగలే పరిటాల రవిని కాల్చి చంపారు
చంద్రబాబును రాక్షసుడు అనడమే జగన్ రాక్షసత్వానికి పరాకాష్ట అని యనమల అన్నారు. జగన్ కన్నా బ్రహ్మ రాక్షసుడు ప్రపంచంలోనే లేడన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 200 మంది టీడీపీ కార్యకర్తలను చంపేశారన్నారు. రాక్షసత్వంతో పట్టపగలే పరిటాల రవిని కాల్చి చంపారన్నారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అడ్డంగా భక్షిస్తాడన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెడతారన్నారు. రాక్షస మూకలన్నీ ఏకమవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications