నయవంచకులకు ఈ అర్హత ఉందా, ఇదీ నీ వంచన చరిత్ర!: జగన్‌పై యనమల
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వంచన వ్యతిరేక దీక్షపై మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం మండిపడ్డారు. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించడం వంచన కాదా అని ప్రశ్నించారు.
వంచకులకు నయవంచన దినం పాటించే అర్హత ఉందా అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పేదలకు సేవ చేసిన చంద్రబాబును వంచకుడు అని జగన్ అనడం అవివేకం అన్నారు. హైదరాబాదులోని లోటస్ పాండు, బెంగళూరులోని ఎలహంక, ఇడుపులపాయలో రాజభవనాలు నిర్మించింది పేదల సొమ్ముతో కాదన్నారు.

పేదల సొమ్ము దోపిడీ చేసి ఎస్టేట్లు నిర్మించుకున్న జగన్‌ను మించిన వంచకుడు ఎవరని నిలదీశారు. వారంలో నాలుగు రోజులు పాదయాత్ర, రెండు రోజులు లాయర్లతో భేటీ, ఒకరోజు కోర్టు బోను ఎక్కడం వంచన కాదా అన్నారు. విభజన సమయంలో సోనియా గాంధీతో లాలూచీపడి బెయిల్ తెచ్చుకోవడం వంచన కాక మరేమిటన్నారు.
కేసుల మాఫీ కోసం బీజేపీతో లాలూచీ పడటం వంచన కాక మరేమిటన్నారు. పోలవరంపై ఫిర్యాదులు, కోర్టు స్టేలతో అడ్డుకోవడం కూడా వంచన అన్నారు. రాజధానిపై కోర్టు కేసులు వేయించి ల్యాండ్ పూలింగ్ అడ్డుకోవడం వంచన అన్నారు. వైయస్ పాలనలో రైతులు, మహిళలు, యువతను దారుణంగా వంచించారన్నారు.
డ్వాక్రా మహిళలను మైక్రో ఫైనాన్స్ ఆగడాలకు బలి చేశారన్నారు. నమ్మకద్రోహం చేసిన బీజేపీని విమర్శించకుండా జగన్ నయవంచనకు పాల్పడుతున్నారన్నారు. ప్రధాని మోడీని విమర్శిస్తే బేడీలు పడతాయని ఆందోళన చెందుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications