ఆర్థిక పరిస్థితి బాగోలేదు: యనమల సంచలనం, ‘ఛార్జీల పెంపు లేదు, కానుకలు’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎఫ్ఆర్‌బీఎం చట్టం ప్రకారం రుణం పొందేందుకు అర్హత ఉందని తెలిపారు.

రుణాలు.. భారాలు
మొత్తం రూ.7వేల కోట్ల రుణానికి అర్హత ఉందని మంత్రి యనమల తెలిపారు. కార్పొరేషన్ల రుణాలు పొందేందుకు ప్రభుత్వం చేస్తోందని వివరించారు. వర్కర్లు, గుత్తేదారులపై 12శాతం జీఎస్టీ వల్ల ప్రభుత్వంపై రూ. 700కోట్ల భారం పడుతుందని చెప్పారు. రైతు రుణమాఫీకి రూ.3వేల కోట్లు, డ్వాక్రా సంఘాల రుణమాఫీకి రూ. 2వేల కోట్లు విడుదల చేస్తామని మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు.

విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అంతేగాక, వ్యయాలు తగ్గించుకోవడం, తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు జరపడంపై దృష్టి పెట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆయన సూచించారు. సచివాలయంలో గురువారం సీఎం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
డిమాండ్-సప్లయ్ ఆధారంగా సబ్ స్టేషన్లు, ఇతర మౌళిక వసతుల కల్పన జరగాలని సీఎం సూచించారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని, కొనుగోలును క్రమంగా తగ్గించుకుని.. పునరుత్పాదక విద్యుత్‌ను పెద్ద ఎత్తున పెంచాలని, ఇందుకు సమగ్ర కార్యాచరణ ఉండాలని చంద్రబాబు సూచించారు.

ఎస్సీ జంటలకు కానుకలు
పేద దళితులకు బాబు ప్రభుత్వం కానుకలు ప్రకటించింది. దళిత జంటకు పెళ్లికానుకగా రూ.30 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. తాజాగా ఎస్సీలకూ ‘చంద్రన్న పెళ్లి కానుక'ను ప్రకటించారు. ఈ పథకం కింద ఒక్కో ఎస్సీ జంటకు రూ.30వేలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా సుమారు 20వేలకు పైగా పేద దళిత జంటలు వివాహబంధంతో ఒకటవుతున్నాయి. చంద్రన్న పెళ్లికానుకతో వారందరికీ లబ్ధి చేకూరనుంది.

బీసీ, మైనార్టీలకూ..
మరోవైపు బీసీ జంటలకు చంద్రన్న పెళ్లి కానుకగా రూ.25వేలు ప్రకటించిన ప్రభుత్వం, ఆ మొత్తాన్ని మరో రూ.5వేలు పెంచి, రూ.30వేలు చొప్పున చంద్రన్న పెళ్లి కానుకను ఇవ్వాలని భావిస్తోంది. ఈమేరకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఏటా 40వేల మంది బీసీలకు ఈ చంద్రన్న పెళ్లికానుకను అందించనున్నారు. ముస్లిం మైనార్టీలకు దుల్హన్ పేరుతో పెళ్లి కానుకగా రూ.50వేలు, గిరిజనులకు పెళ్లికానుకగా రూ.50వేలు అందిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న వారికి మనిషికి రూ.1200 కట్టించుకుని ఆరోగ్య బీమా కల్పిస్తోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!