జీఎస్‌టీ వల్ల ఏపీకి 4700 కోట్లు నష్టం: బాబుకు దొరికిన మోడీ అపాయింట్‌మెంట్
అమరావతి: టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లడానికి ముందు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ బీసీల కోసం సబ్ ప్లాన్ తెచ్చిన ఘటన టీడీపీదేనని చెప్పారు. బీసీలు ఆర్ధికంగా నిలదొక్కుకునే వరకు టీడీపీ అండగా నిలుస్తుందని అన్నారు.
బీసీల అభివృద్ధి కోసం రూ. 2700 కోట్లు కేటాయించామని అన్నారు. బీసీలను అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అణగదొక్కిందని చెప్పిన చంద్రబాబు టీడీపీకి వెన్నుముకగా నిలిచిన బీసీలకు అండగా నిలుస్తామని చెప్పారు. బీసీలకు జరిగిన అన్యాయానికి పూర్తిగా న్యాయం జరిగే వరకూ బాధ్యత వహిస్తానని చెప్పుకొచ్చారు.
కాగా, గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలవనున్నారు. అనంతరం 11 గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.

ఈ మేరకు ప్రధాని మోడీని కలిసేందుకు పీఎంఓ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ ఇచ్చింది. ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
జీఎస్‌టీ వల్ల ఏపీకి రూ.4700 కోట్ల నష్టం: మంత్రి యనమల
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును దేశ ప్రయోజనాల దృష్ట్యా స్వాగతించినట్లు ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎస్‌టీ బిల్లుతో తీసుకొస్తున్న ఏకీకృత పన్ను విధానం దేశానికి, రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న పన్ను వివాదాలను జీఎస్‌టీ కౌన్సిల్ పరిష్కరిస్తుందని తెలిపారు. కాగా కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్‌టీ బిల్లు వల్ల ఏపీకి రూ.4700 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. జీఎస్‌టీ బిల్లు వల్ల ఏపీకి ఏర్పడే నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications