జగన్! ఏపీకి పట్టిన ఓ చీడపురుగు: యరపతినేని, కాల్వ ఫైర్
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆ పార్టీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వేర్వేరుగా మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీకి పట్టిన చీడపురుగని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తగా, అతనో బాధ్యత లేని వ్యక్తంటూ ఫైరయ్యారు కాల్వ శ్రీనివాసులు.
అవినీతి, అక్రమం, అరాచకం, నీచం అన్నీ కలిపితే జగన్ అని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్లు కష్టపడుతున్నారని, కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ నాయుడు కృషి చేస్తున్నారని, లోకేష్ పేరెత్తే కనీస అర్హత జగన్‌కు లేదని యరపతినేని మండిపడ్డారు.

విపక్ష నేతగా కనీస బాధ్యతతో కూడా వ్యవహరించకుండా ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న జగన్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదని చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనట్టుగా రాయలసీమలో ఎండుతున్న పంటలను కాపాడాలని తాము ప్రయత్నిస్తుంటే, దాన్ని కూడా జగన్ రాజకీయ లబ్దికోసం వాడుకుంటున్నారని నిప్పులు చెరిగారు.
గతంలో ఎన్నడైనా ఇంత ఎత్తున పంటలను కాపాడిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క రోజు కూడా రైతులను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా రెయిన్ గన్స్ విధానాన్ని ప్రవేశపెట్టామని, కొన్ని బాలారిష్టాలు ఉన్నప్పటికీ, తమ ప్రభుత్వం వాటిని అధిగమించి ముందుకు సాగుతోందని తెలిపారు.ఒకేసారి అందరికీ రెయిన్ గన్స్ సదుపాయంతో నీరివ్వడం సాధ్యం కాదని, దశలవారీగా తాము రైతులకు సహకరిస్తుంటే, విపక్షాలు రాద్ధాంతం చేయడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications