చంద్రబాబుతో యార్లగడ్డ భేటీ, లైన్ క్లియర్ - గన్నవరం 2019 రిపీట్..!!
ఏపీలో ఎన్నికల వేళ గన్నవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ నెల 22న గన్నవరంలోనే నారా లోకేశ్ సమక్షంలో యార్లగడ్డ టీడీపీలో చేరటం లాంఛనంగా మారింది. సీటు పైన హామీ పొందిన తరువాతనే వైసీపీ వీడినట్లు తెలుస్తోంది. దీంతో, మరోసారి గన్నవరం బరిలో 2019 పోటీ దారులే పార్టీలు మారి తల పడటం ఖాయంగా కనిపిస్తోంది.
చంద్రబాబుతో భేటీ.. క్లారిటీ : వైసీపీని వీడిన యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరటానికి ముహూర్తం ఖరారైంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ తరువాత యార్లగడ్డ ఇక గన్నవరంలో లోకేశ్ పాదయాత్రలో పాల్గొనేందుకు నిర్ణయించారు. ఈ సాయంత్రం లోకేశ్ యువగళం గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

ప్రారంభం నుంచి బహిరంగ సభ వరకు లోకేశ్ యాత్రను టీడీపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. దీంతో, యార్లగడ్డ గన్నవరంలో లోకేశ్ తో పాటుగా పాదయాత్రలో పాల్గొని..బహిరంగ సభలో అధికారికంగా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు యార్లగడ్డకు హామీ దక్కిందని సమాచారం.
లోకేశ్ సమక్షంలో టీడీపీలోకి : ఇప్పుడు టీడీపీ, యార్లగడ్డ ఇద్దరి ఉమ్మడి లక్ష్యం స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 2019 ఎన్నికల్లో వంశీ టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్దిగా బరిలో నిలిచిన యార్లగడ్డ వెంకటరావు పైన విజయం సాధించారు. ఆ తరువాత వైసీపీకి దగ్గరయ్యారు. వంశీ వైసీపీకి రావటంతో యార్లగడ్డ, డాక్టర్ దుట్ట రామచంద్రరావు ఆగ్రహంతో ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో తనకు సీటు రాదని నిర్దారణ అయిన తరువాత యార్లగడ్డ టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగింది. గన్నవరం నుంచి పోటీకి తాను సిద్దమని చెప్పటంతో ముందుగా పార్టీలో చేరాలని సూచించినట్లు సమాచారం. ఈ మేరకు యార్లగడ్డ అధికారంలోకి టీడీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇదే సమయంలో దుట్టా రామచంద్రరావు నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

వంశీ వర్సస్ యార్లగడ్డ : వల్లభనేని వంశీని ఎలలాగైనా ఓడిస్తామని టీడీపీ నేతలు శపథం చేస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరంలో లోకేశ్ యాత్ర వేళ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసారు. ఈ సభ ద్వారా యార్లగడ్డ టీడీపీ నేతగా నియోజకర్గంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. టీడీపీ నుంచి వచ్చిన హామీ అమలైతే తిరిగి 2019లో గన్నవరం అసెంబ్లీ బరిలో పోటీ పడిన వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు తిరిగి తలపడనున్నారు.
అయితే, ఈ సారి వంశీ వైసీపీ నుంచి..యార్లగడ్డ టీడీపీ నుంచి బరిలో ఉంటారు. 2019లో జగన్ వేవ్ సమయంలో స్వల్ప మెజార్టీతో టీడీపీ నుంచి గెలిచిన వంశీ..తిరిగి గెలిచి తనను టార్గెట్ చేసిన వారికి సమాధానం చెప్పాలని భావిస్తున్నారు. యార్లగడ్డకు వచ్చే ఎన్నిక ప్రతిష్ఠాత్మకం కానుంది. దీంతో, గన్నవరం ఫలితంతో పాటుగా రాజకీయం ఆసక్తిగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications