Yatra 2: విజిల్స్ వేయించే కొడాలి నాని సీన్స్
Kodali Nani: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంపై తెరకెక్కుతున్న మూవీ.. యాత్ర 2 (Yatra 2). మహీ వీ రాఘవ్ దర్శకుడు. 2019లో విడుదలైన యాత్రకు ఇది సీక్వెల్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర మూవీ అప్పట్లో రాజకీయంగా సంచలనం రేపింది.
ఇప్పుడా సినిమాకు సీక్వెల్ సిద్ధమౌతోంది. ప్రస్తుతం సెట్స్‌పై ఉందా మూవీ. వైఎస్ జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తోన్నారు. ఇందులో కూడా వైఎస్సార్ క్యారెక్టర్ ఉంది. మమ్ముట్టే ఆ పాత్రను పోషిస్తోన్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది ఈ మూవీ.

ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర 2 రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని గ్లింప్సెస్ విడుదలయ్యాయి. టైటిల్ అనౌన్స్‌మెంట్, మోషన్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. యాత్ర తరహాలోనే ఇది కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
తాజాగా- ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ ఉదయం 11 గంటలకు దర్శకుడు మహీ వీ రాఘవ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. సోనియా గాంధీ, చంద్రబాబు, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, కే రోశయ్య సహా అన్ని ప్రధాన క్యారెక్టర్లు ఇందులో కనిపించాయి. చంద్రబాబు పాత్రను బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ పోషించారు.
వైఎస్ జగన్‌కు అత్యంత ఆప్తుడు, మాజీ మంత్రి కొడాలి నాని క్యారెక్టర్ కూడా యాత్ర 2 ఉండటం జోష్ పెంచినట్టయింది. ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న కొడాలి నాని.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ సహా తెలుగుదేశం, జనసేన పార్టీపై ఏ స్థాయిలో విరుచుకుపడుతుంటారో తెలిసిన విషయమే.
యాత్ర 2లో కూడా అలాంటి సన్నివేశాలు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్‌లో కొడాలి నానిని ఇంట్రడ్యూస్ చేశాడు దర్శకుడు మహీ వీ రాఘవ్. ఒత్తుగా పెరిగిన జట్టు, గుబురు గడ్డం, మెడలో రుద్రాక్ష మాల, తెలుగుదేశం పార్టీ కండువాతో కనిపించారు కోడాలి నాని.

వైఎస్సార్ పాత్రను పోషించిన మమ్ముట్టితో మాట్లాడే సీన్ అది. నా రాజకీయ ప్రత్యర్థిని అయినా, శతృవును అయినా ఓడించాలనుకుంటానే గానీ మీ నాయకుడు (చంద్రబాబు)లాగా నాశనం కోరుకోనయ్యా.. అని మమ్ముట్టి పలికే డైలాగ్‌లో కొడాలి నాని క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ సినిమాలో నాని క్యారెక్టర్‌కు చెప్పుకోదగ్గ స్పేస్ లభించిందని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీతో కొడాలి నాని రాజకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున గుడివాడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయదుందుభి మోగించారు. వచ్చే ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారాయన.












Click it and Unblock the Notifications