వైసీపీ మరో భారీప్రాజెక్ట్: జగన్ ఫోటోతో సారు రేంజ్ కి తగ్గకుండా మూడు బెంచీలు.. టీడీపీ ట్రోల్స్
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని, జగన్ సర్కార్ పాలనను టార్గెట్ చేస్తూ నిత్యం ఏదో ఒక అంశంపై ట్రోల్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తాజాగా సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేయడానికి తెలుగుదేశం పార్టీకి మరో కొత్త అంశం దొరికింది. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల విమర్శలకు కారణంగా మారింది. ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యే? ఆయనేం చేశారంటే?

మూడంటే మూడే బెంచీలు .. ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే ; టీడీపీ ట్రోల్
తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తాజాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణంలో ఉన్న పార్కులలో అక్కడికి వచ్చే వారి సౌకర్యం కోసం మూడు బెంచీలు ఏర్పాటు చేసి, ఆ బెంచీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి ఎమ్మెల్యే ఏర్పాటు చేయించిన మూడు బెంచీలపైన సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఫోటోలు కూడా ఏర్పాటు చేశారు. ఇక బెంచ్ పైన కొబ్బరికాయ కొట్టి మరీ ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఘనకార్యాన్ని, చాలా గొప్ప పని అని మెచ్చుకుంటూ ట్రోల్ చేస్తుంది. ఇది చాలా పెద్ద ఓపెనింగ్ అంటూ సెటైర్లు వేస్తుంది.
అసెంబ్లీలో ఉత్త వెకిలి నవ్వులే అనుకున్నాం... కానీ పార్కుల్లో అలా కూడానా
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికపై దీనిపై పోస్ట్ చేసి ఓ వీడియోను కూడా ట్రోల్ చేస్తుంది. అసెంబ్లీలో ఉత్త వెకిలి నవ్వులే అనుకున్నాం... అబ్బో! పార్కుల్లో బెంచీల్లాంటి నిర్మాణాలు కూడా చేయిస్తున్నారే! తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ భారీ ప్రాజెక్టు చూసాక... సారు తన రేంజ్ కిఏమాత్రం తగ్గట్లేదనిపిస్తోంది కదా అంటూ తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఘనకార్యాన్ని టార్గెట్ చేసి ఎమ్మెల్యే పరువుతో పాటుగా, జగన్ సర్కార్ పరువును తీస్తోంది టీడీపీ. గతంలో గ్రామ పంచాయతీలకు, స్కూల్స్ కు, వాటర్ ట్యాంకు లకు, చివరకు స్మశానాలకు కూడా వైసిపి రంగులు వేయడం పై సోషల్ మీడియాలో ఇదేవిధంగా ట్రోల్ చేసిన టిడిపి ఇప్పుడు మళ్ళీ విరుచుకుపడుతుంది.
జగన్ , ఎమ్మెల్యే ఫోటోలతో బెంచీలు .. జగన్ సర్కార్ కొత్త, భారీ ప్రాజెక్ట్ లు అంటూ ట్రోల్స్
చంద్రబాబు నాయుడు పరిపాలించిన సమయంలో ఇండస్ట్రియల్ పార్క్ లు ఓపెన్ చేసే వాళ్ళని కానీ ఇప్పుడు పార్క్ లో బెంచీలు ఓపెన్ చేస్తున్నారు అంతే అంటూ ఎద్దేవా చేస్తున్నారు. వైయస్సార్ ప్రభుత్వంలో పార్కుల్లో బెంచీలు ఓపెన్ చేసుకుంటున్న కర్మ పట్టిందని తెనాలి పార్క్ లో ఎమ్మెల్యే శివ బెంచీలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ సర్కార్ కొత్త ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమయ్యాయి అంటూ ఎద్దేవా చేస్తుంది టీడీపీ .
జగనన్న బల్లపై సేదతీరే పథకం ... స్థానికుల సంబరాలు
తెనాలి ఎమ్మెల్యే చేతుల మీదగా భారీ ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యిందని ఈ పథకం పేరు జగనన్న బల్లపై సేదతీరడం అంటూ తెలుగు తమ్ముళ్ళ ట్రోల్స్ కొనసాగుతున్నాయి. తమ ప్రాంతానికి ఇంత భారీ ప్రాజెక్ట్ వచ్చినందుకు ఆనందోత్సవం, సంబరాలు చేసుకుంటున్న స్థానిక ప్రజలు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా.ఉద్యోగాల్లో చేరేందుకు తండోపతండాలుగా వస్తున్న చుట్టుపక్క ప్రాంత యువత అంటూ జగన్ సర్కార్ హయాంలో జరుగుతున్నది ఇదే అని చెప్తున్నారు.

మూడంటే మూడు బెంచీలు ... అందులోనూ ప్రచారమేనా ?
పార్కుల్లో బెంచీలు ఏర్పాటు చేయడం మంచి పనే అయినా, పార్కులకు ఆహ్లాదం కోసం వాచే వారికి సౌకర్యమే అయినా ఆ బెంచీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, జగన్ సర్కార్ గురించి ప్రచారం చేయడం, వాటిపై పోస్టర్లు వేయడం మాత్రం తెలుగు తమ్ముళ్ళకు అవకాశం ఇచ్చింది. ఇక మూడంటే మూడు బెంచీలు ఏర్పాటు చేసి అదేదో ఘనకార్యం చేసినట్టుగా ఎమ్మెల్యే వెళ్లి మరీ హంగామా చేయడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ట్రోల్స్ కు కారణంగా మారింది. జగన్ ప్రభుత్వం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసే ప్రతి చిన్న పని నిశితంగా చూస్తున్న తెలుగు తమ్ముళ్లు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా టార్గెట్ చేస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications