అమరావతి రైతులను అడ్డుకున్న వైసీపీ.. నిడదవోలులో ఉద్రిక్తత
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు చేస్తున్న పాదయాత్ర నిడదవోలుకు చేరుకుంది. పాదయాత్రను అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పట్టణంలోని గణేష్ సెంటర్ కు రైతలు పాదయాత్ర చేరుకోగానే వైసీపీ శ్రేణులు నల్లబెలూన్లు ఎగరవేయడంతోపాటు మూడు రాజధానులు కావాలంటూ ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
అమరావతి రైతుల పాదయాత్రకు అక్కడకు చేరుకోవడానికి రెండుగంటల ముందుగానే వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నా పోలీసులు వారిని నిలవరించలేదని, కేవలం బారికేడ్లతో సరిపెట్టారంటూ రైతులు విమర్శించారు. వైసీపీ మినహా ఇతర పార్టీలన్నీ పాదయాత్రకు మద్దతు తెలియజేసినవారంతా చేరుకోవడంతో ఇరువర్గాల నినాదాలతో నిడదవోలు మార్మోగింది. వైసీపీ నిరసనలను పట్టించుకోకుండా రైతులు ముందుకు సాగారు.

అమరావతినే ఏకైకా రాజధానిగా డిమాండ్ చేస్తూ గత నెల 12వ తేదీన అమరావతి రైతులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటివిడతగా న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో 45 రోజులపాటు హైకోర్టు నుంచి అలిపిరి వరకు పాదయాత్ర నిర్వహించారు. రెండో విడతగా అసెంబ్లీ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి దేవస్థానం వరకు 60 రోజుల యాత్రను ప్రారంభించారు. యాత్ర ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజాస్వామిక వాదాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అమరావతికి వ్యతిరేకగా ఉండటంతో తాము న్యాయస్థానాలనే నమ్ముకున్నామని రైతులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications