ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతా - జగన్ సన్నిహిత ఎమ్మెల్యే ప్రకటన..!!
వైసీపీలో మరో ఎమ్మెల్యే సంచలన ప్రకటన చేసారు. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పులో భాగంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి టికెట్ నిరాకరించారు. అనంతపురం జిల్లాలో చేస్తున్న మార్పుల్లో భాగంగా రాయదుర్గం సీటు మారుస్తున్నట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు. దీంతో క్యాంపు కార్యాలయానికి చేరుకున్న రామచంద్రారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలతో సమావేశమయ్యారు. సీటు రాదని తేలటంతో స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగుతాని కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు.
వైసీపీ ఇంఛార్జ్ ల మార్పులతో ఎమ్మెల్యేలు ఆక్రోశానికి గురవుతున్నారు. జగన్ పార్టీ ఏర్పాటు నుంచి కొనసాగుతున్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి సీటు నిరాకరించారు. 2009, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాపు రామచంద్రారెడ్డి గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో సర్వే నివేదికలు వ్యతిరేకంగా ఉండటంతో సీటు ఇవ్వటం లేదని పార్టీ నాయకత్వం సమాచారం ఇచ్చింది. భవిష్యత్ లో మరో విధంగా ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం కాపు రామచంద్రారెడ్డి తన భార్య, కుమారుడుతో క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎంతో కలవాలని ప్రయత్నించారు. కానీ, ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం దక్కలేదని కాపు రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు.

దీంతో, ఊహించని విధంగా జరిగిందని వాపోయారు. వైఎస్సార్ కుటుంబం, జగన్ పైన తాము ఎంతో అభిమానంతో ఉన్నామని వివరించారు. తన ఇంట ఎక్కడ చూసినా జగన్ కనిపిస్తారని చెప్పుకొచ్చారు. తనను అవమానించారని ఉద్వేగానికి లోనయ్యారు. ఇప్పటి వరకు తనకు ఏ పార్టీ నుంచి ఆఫర్ రాలేదన్నారు. వస్తే పరిశీలిస్తానని చెప్పుకొచ్చారు. ఏ పార్టీ నుంచి అవకాశం లేకపోయినా..వచ్చే ఎన్నికల్లో తాను కళ్యాణ దుర్గం నుంచి..తన సతీమణి రాయదుర్గం నుంచి పోటీ చేయటం ఖాయమని కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. తనకు నియోజకవర్గంలో బలం ఉన్నా సర్వేల పేరుతో పక్కన పెట్టటం ఏంటని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో పలు మార్పులు చేసారు. ఇక, ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించటంతో వైసీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications