నేనే గనక టీమిండియా కోచ్ గా ఉంటే..: వైభవ్ పై మంజ్రేకర్
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీలంక డంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక 'ఎ’ జట్టు ఆటగాడితో వైభవ్ తోపులాటకు దిగడాన్ని తప్పుపట్టారు. చిన్న వయస్సులోనే ఇటువంటి వివాదాల జోలికి వెళ్లడం.. అటు అతని కేరీర్ ను కూడా ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న తరుణంలో ఆయన తెరమీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వైభవ్‌ను తదుపరి మ్యాచ్ నుంచి తప్పించాల్సి ఉండేదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ఎంత టాలెంట్ ఉన్నా గానీ ఓ అంతర్జాతీయ స్థాయి వేదికపై, అదే స్థాయి జట్టుతో ఆడుతున్నప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఓ క్రీడాకారుడు వ్యవహరించే పద్ధతి అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

చిన్న వయసులోనే హద్దులు మీరి ప్రవర్తించినప్పుడు తగిన చర్యలు తీసుకోకపోతే, అది యువ క్రికెటర్లలో క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తుందని మంజ్రేకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ వివాదం సాగుతున్నప్పటికీ.. భారత 'ఎ’ జట్టు యాజమాన్యం ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్‌లో సూర్యవంశీని తుది జట్టులో కొనసాగించడంపైనా ఆయన స్పందించారు.
ఒకవేళ తానే గనుక ఇండియా 'ఎ’ జట్టుకు కోచ్ లేదా మేనేజర్‌గా ఉండి ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరి0గిన మ్యాచ్‌కు వైభవ్ సూర్యవంశీని తీసుకోకపోయేవాడినని తేల్చి చెప్పారు. తుది జట్టు నుండి ఖచ్చితంగా అతన్ని దూరం పెట్టేవాడినని పేర్కొన్నారు. ప్రత్యర్థి ఆటగాళ్లు ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ మైదానంలో భౌతిక ఘర్షణలకు దిగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఆటగాళ్ళు తమ భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉండాలని ఆయన హితవు పలికారు.
శ్రీలంక 'ఎ’ జట్టుతో జరిగిన ఉత్కంఠభరితమైన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో భారత్ 'ఎ’ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే వైభవ్.. శ్రీలంక బౌలర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య సృష్టించబడిన ఘర్షణ వాతావరణానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన కొందరు సీనియర్లు వైభవ్‌ను సమర్థించగా, నిబంధనలను గౌరవించాల్సిందేనని మంజ్రేకర్ లాంటి మరికొందరు తేల్చి చెబుతున్నారు.
If I was India A coach or manager I would have left Vaibhav Suryavanshi out for this game v AFG. Only to let him know that’s it’s not OK to get physical on the field. Whatever the provocations.
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) June 17, 2026
తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఫర్వాలేదనిపించుకున్నాడు. 28 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఫరీదున్ దావుద్జల్ బౌలింగ్ మహ్మద్ ఇషాక్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 39 ఓవర్లల్లో నాలుగు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. తిలక్ వర్మ, సూర్యాంశ్ షెడ్జె క్రీజ్ లో ఉన్నారు.












Click it and Unblock the Notifications