మస్క్ ఆస్తి కరగడానికి ఎన్ని వందల ఏళ్లు పడుతుందో తెలుసా!
ప్రపంచ ఆర్థిక రంగంలో ఒక సరికొత్త చరిత్ర లిఖించబడింది. ఇప్పటివరకు మనం కోటీశ్వరులను చూశాం, బిలియనీర్లను చూశాం.. కానీ ఇప్పుడు ప్రపంచానికి ఒక 'ట్రిలియనీర్' పరిచయమయ్యాడు. ఆయనే టెక్ దిగ్గజం ఎలోన్ మస్క్. మానవ వాణిజ్య చరిత్రలోనే ఇంతటి భారీ వ్యక్తిగత సంపదను సంపాదించిన మొదటి వ్యక్తిగా మస్క్ సరికొత్త రికార్డు సృష్టించారని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ CNN ప్రకటించింది. 2026 జూన్ 12న ఆయనకు చెందిన రాకెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ 'స్పేస్ఎక్స్' (SpaceX) షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టిన (ఐపీఓ) శుభ ముహూర్తాన ఈ అద్భుతం జరిగింది.
నాస్డాక్ (Nasdaq) స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో "SPCX" పేరుతో స్పేస్ఎక్స్ షేర్లు ఒక్కొక్కటి $150 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. నిజానికి దీని లిస్టింగ్ ధర $135 కాగా, అంతకంటే ఎక్కువ ధరకు ఓపెన్ అయి ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. ఈ ఐపీఓ ద్వారా ఏకంగా 75 బిలియన్ డాలర్ల రికార్డు నిధులను సమకూర్చగా, స్పేస్ఎక్స్ సంస్థ మొత్తం విలువ దాదాపు 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పటికే ఆయనకున్న టెస్లా (Tesla) కంపెనీ షేర్లతో కలుపుకుంటే.. మస్క్ మొత్తం ఆస్తి విలువ ఇప్పుడు అక్షరాలా 1.26 ట్రిలియన్ డాలర్లకు (మన దేశీ కరెన్సీలో లక్షల కోట్లకు పైనే) చేరుకుంది.

గంటకు కోట్లు ఖర్చు పెట్టినా తరగదు!
ఒక ట్రిలియన్ డాలర్లు అంటే ఎంత? ఒక మిలియన్ సంపదను పది లక్షల సార్లు గుణిస్తే వచ్చేంత పెద్ద ఫిగర్ ఇది. సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. మీరు గంటకు రూ. 8 కోట్లకు పైగా ($1 మిలియన్) చొప్పున.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా, ఒక్క సెకను కూడా ఆపకుండా ఖర్చు పెడుతూనే ఉన్నారనుకుందాం. అలా ఖర్చు పెట్టినా కూడా ఈ ఒక ట్రిలియన్ డాలర్ల డబ్బు పూర్తి కావడానికి వందేళ్లకు పైగా సమయం పడుతుంది. అంటే ఇప్పటి నుంచి మస్క్ ఆ రేంజ్‌లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ పోయినా.. దాదాపు 2140 సంవత్సరం వరకు ఆయన ఆస్తి కరిగిపోదు, పైగా ఇంకా మిగిలే ఉంటుంది! అయితే ఇదంతా పేపర్ సంపద (షేర్ల విలువ) మాత్రమేనని, భవిష్యత్తులో ఇన్వెస్టర్లు ఆయన కంపెనీలను ఎలా ఆదరిస్తారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
ప్రపంచంలోని చాలా దేశాల కంటే మస్కే పెద్ద!
ఎలోన్ మస్క్ సంపద ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూడాలి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 దేశాల ఆర్థిక వ్యవస్థలు మాత్రమే $1.1 ట్రిలియన్ కంటే పెద్దవిగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే, ప్రపంచంలోని అత్యధిక దేశాల మొత్తం బడ్జెట్ లేదా ఆర్థిక వ్యవస్థ విలువ కంటే ఎలోన్ మస్క్ ఆస్తి చాలా పెద్దదని అర్థం చేసుకోవచ్చు. చివరకు తైవాన్ దేశ మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే మస్క్ ఆస్తి ఎక్కువేనని అంచనా.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ ధనవంతుల జాబితాలో మస్క్ తర్వాత ఉన్న టాప్-3 లీడర్లు.. గూగుల్ కో-ఫౌండర్లు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ , అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ ల ముగ్గురి ఆస్తులను కలిపినా కూడా ఎలోన్ మస్క్ ఆస్తి కంటే తక్కువే కావడం విశేషం. అలాగే ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ లాంటి వాళ్లు ఏడుగురు కలిస్తే ఎంత ఆస్తి అవుతుందో.. ఒక్క ఎలోన్ మస్క్ ఆస్తి అంతకు సమానమని బ్లూమ్‌బెర్గ్ స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications