నిరంజన్ కు మాట ఇచ్చిన పవన్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణలోని హన్మకొండకు పట్టణానికి చెందిన తన వీరాభిమాని పొనుగోటి నిరంజన్ ను పరామర్శించారు. ఆప్యాయంగా హృదయానికి హత్తుకున్నారు. ఆ చిన్నారి కోరికను నెరవేర్చారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన కొద్దిసేపటి కిందటే హన్మకొండకు చేరుకున్నారు. నేరుగా హనుమాన్ నగర్‌లో ఉన్న నిరంజన్ నివాసానికి వెళ్లారు.
అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు నిరంజన్. డీఎండీ (Duchenne Muscular Dystrophy) అనే అరుదైన కండరాల క్షీణత వ్యాధితో మంచానికే పరిమితం అయ్యాడు. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. తనను కలవాలని ఆశపడుతున్న విషయం జనసేన తెలంగాణ ప్రతినిధుల ద్వారా పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో బీజీగా ఉన్నప్పటికీ.. తన అభిమాని కోసం స్వయంగా అతని ఇంటికి వచ్చారు.

లేవలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని చూసి పవన్ చలించిపోయారు. మంచంపై నిరంజన్ పక్కనే కూర్చొని ఆత్మీయంగా హత్తుకున్నారు. ఆప్యాయంగా నుదుటిపై ముద్దుపెట్టారు. ధైర్యం చెప్పారు. నిరంజన్ గతంలో ఆరోగ్యంగా ఉన్న సమయంలో సినిమాల్లోని డాన్స్ స్టెప్స్‌ను అనుకరిస్తూ చేసిన స్టెప్పులు, ఫొటోలను పవన్ ఆసక్తిగా తిలకించారు. ఇంట్లో వాళ్లు, స్నేహితులు అంతా ఛోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని ఆ బాలుడు ఆనందంతో చెప్పగా ఎంతో సంతోషించారు.
నిరంజన్ పడుతున్న బాధను చూసి కదిలిపోయిన పవన్, ఆ బాలుడి తండ్రి రాంగోపాల్, తల్లి మానసతో మాట్లాడారు. చికిత్స గురించి ఆరా తీశారు. భగవంతుని ఆశీస్సులు ఉంటాయంటూ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి శేషవస్త్రాన్ని ఆ బాలుడికి కప్పి, తీర్థప్రసాదాలను అందించారు. వైద్య ఖర్చుల నిమిత్తం పవన్ కల్యాణ్ తక్షణ సాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. వైద్య సాయంతోనే సరిపెట్టకుండా ఆ కుటుంబ శాశ్వత జీవనోపాధి కోసం ఒక దీర్ఘకాలిక భరోసాను కల్పించారు.
నిరంజన్ తల్లిదండ్రులు గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్‌లో పనిచేసిన అనుభవం ఉండటంతో వారికి ఓ క్యాంటీన్ ఏర్పాటు చేయించి జీవితంలో స్థిరపడేలా చూడాలని జనసేన పార్టీ తెలంగాణ నాయకులను సూచించారాయన. తనకు ఒక కుక్కపిల్ల కావాలని నిరంజన్ కోరగా, తప్పకుండా పంపిస్తానని పవన్ హామీ ఇచ్చారు. అద్దె ఇంట్లో ఉండడం వల్ల యజమానులు కుక్కను పెంచడానికి అంగీకరించట్లేదని నిరంజన్ తండ్రి చెప్పడంతో, పవన్ చొరవ తీసుకుని ఆ ఇంటి యజమానిని పిలిపించి మాట్లాడి ఒప్పించారు.
అనంతరం అక్కడి నుంచి నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి వెండి ప్రతిమను పూజించి ఆ కుటుంబానికి అందజేస్తానని చెప్పారు. అధికారిక హోదాలో ఉంటూనే ఒక సామాన్య అభిమాని కోరిక కోసం స్వయంగా తెలంగాణకు వచ్చి పవన్ చూపిన ఈ గొప్ప మనసు ఇరు రాష్ట్రాల ప్రజలలో ఆదరణ పొందుతోంది.












Click it and Unblock the Notifications