రోజాకు సినీ..రాజకీయ గురువు శివప్రసాద్ : వైసీపీ ఆఫర్ తిరస్కరించి: సోదరి మాత్రం..!!
టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూసారు. ఆయన రాజకీయంగానే కాదు..సినీ రంగంలోనూ పేరు సంపాదించారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు సినీ రంగంలో..రాజకీయ రంగంలోనూ ఆయనే గురువు. శివ ప్రసాద్ తీసిని ప్రేమ తపస్సు ద్వారా రోజా సినీ రంగ ప్రవేశం చేసారు. అదే విధంగా టీడీపీలోకి రోజా ఎంట్రీకి కారణం శివ ప్రసాద్. అనేక సందర్భాల్లో ఆయనే ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు క్లాస్ మేట అయిన శివ ప్రసాద్ ఒక సారి ఎమ్మెల్యేగా..మంత్రిగా..రెండు సార్లు ఎంపీగా పని చేసారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. సినిమాలో చిన్న పాత్రలలో కనిపించిన ఆయన రోజాను వెండితెరకు పరిచయం చేసారు. చంద్రగిరి హైస్కూల్ లో చంద్రబాబుకు సైతం తన నాటకంలో పాత్ర ఇచ్చి..ఆయనకు స్టేజ్ ప్రదర్శనకు అవకాశం ఇచ్చారు.
రోజాను వెండితెర మీదకు తీసుకొచ్చి...
సినిమాల పైన మోజు ఉన్న రోజాకు తొలి అవకాశం ఇచ్చింది శివప్రసాద్. రోజా హీరోయిన్ గా కనిపించిన తొలి సినిమా ప్రేమ తపస్సు. ఆ సినిమా తీసింది ఆయనే. ఆ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఆ తరువాత రెండో సినిమా సైతం శివప్రసాద్ రోజానే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. టోపీ రాజా స్వీటీ రోజాగా పేరుతో ఆ సినిమా తీసారు. రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అయినా..రోజా మాత్రం నిరుత్సాహ పడలేదు.

ఆ తరువాత కొన్ని తమిళ సినిమాల్లోనూ నటించారు. ఇక..నెమ్మెదిగా సక్సెస్ అందుకున్న రోజాకు ఇక తిరుగు లేకుండా పోయింది. రోజా సినీ పరిశ్రమలో ఎంత ఎత్తు ఎదిగినా తనకు తొలి సారిగా అవకాశం ఇచ్చిన శివప్రసాద్ గురించి మాత్రం మరిచిపోలేదు. సినీ పరిశ్రమకే కాకుండా రాజకీయంగానూ టీడీపీలోకి రోజా కు ప్రవేశం కల్పించింది ఆయనే. తన మిత్రుడు..టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు రోజాను తీసుకెళ్లి పార్టీలో చేర్పించారు. ఇక..అక్కడ తన సత్తా నిరూపించుకున్న రోజా ఎమ్మెల్యేగా టిక్కెట్ సాధించారు.
ఎన్నికల్లో ఓడినా తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పని చేసారు. నాడు వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మీద..ప్రజారాజ్యం పార్టీ పైన రోజా చేసిన విమర్శలు రాజకీయంగా వేడి పుట్టించాయి. ఇక, 2009 ఎన్నికల ఫలితాల తరువాత వైయస్సార్ ను కలిసారు. ఆ తరువాత వైయస్సార మరణించారు. జగన్ సొంత పార్టీ ఏర్పాటు చేసిన తరువాత ఆయనకు మద్దతుగా వైసీపీలో చేరి ఇప్పటి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
శివ ప్రసాద్ కు వైసీపీ నుండి ఆఫర్ వచ్చినా..
చిత్తూరు జిల్లాలో పేరున్న టీడీపీ నేతగా శివ ప్రసాద్ కు 2019 ఎన్నికల ముందు వైసీపీ నుండి ఆఫర్ వచ్చింది. అప్పటికే రెండు సార్లు చిత్తూరు ఎంపీగా ఉండటంతో ఆయనకు చిత్తూరు ఎంపీగా పోటీ చేయించే అంశం పైన జగన్ ఆసక్తి చూపించారు. అప్పటికే శివ ప్రసాద్ సోదరి పద్మజారెడ్డి 2017లో వైసీపీలో చేరారు. తనకు వచ్చిన ఆఫర్ పైన శివ ప్రసాద్ తర్జన భర్జన పడ్డారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు తనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వటం లేదని వాపోయారు.
ఆ సమయంలో శివ ప్రసాద్ ఇక టీడీపీ వీడి వైసీపీలో చేరటం ఖాయమని అందరూ భావించారు. అయినా..శివ ప్రసాద్ మాత్రం టీడీపీ వీడలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చిత్తూరు పర్యటనలో ఆయన నేరుగా పార్టీ అధినేతను కలిసి తన బాధను వెల్లగక్కారు. చంద్రబాబు సద్దిచెప్పటంతో వివాదం ముగిసింది. ఇక, తాజా ఎన్నికల్లో ఆయన తిరిగి టీడీపీ ఎంపీగా పోటీ చేసారు. వైసీపీ అభ్యర్ధి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు.












Click it and Unblock the Notifications