Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Year Ender 2022 : ఈ ఏడాది జగన్ కు ఎలా గడిచింది ? గ్రాఫ్ పెరిగిందా లేదా ? కొత్త సవాళ్ల వేళ !

ఏపీలో వైసీపీ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టి మూడున్నరేళ్లు పూర్తి చేసుకున్న వైఎస్ జగన్ కు ఈ ఏడాది ఎలా గడిచింది ? ఓవైపు విపక్షాలు ఏకవుతున్న వేళ, మరోవైపు కేంద్రం నుంచి మద్దతు కరవవుతున్న వేళ, జగన్ కు ఎదురైన కొత్త సవాళ్లేంటి ? వాటిని ఎదుర్కోవడంలో జగన్ సక్సెస్ అయ్యారా లేదా ? అయితే ఏ మేరకు అయ్యారు, కాలేకపోతే వాటికి గల కారణాలేంటన్న అంశాలపై ఓ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం..

 2022లో వైఎస్ జగన్

2022లో వైఎస్ జగన్

2022లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మిశ్రమ ఫలితాలు లభించినట్లు కనిపించింది. ముఖ్యంగా రాష్ట్రంలో తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంక్షేమాన్ని కొనసాగించడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని దాటుకుంటూ సంక్షేమ రథసారధిగా నిలవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అదే సమయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేయలేని పరిస్దితి ఎదురైంది. హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ ప్రభుత్వానికి కొంతమేర సానుకూలంగా కనిపించినా తుదితీర్పు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ మాత్రం తప్పడం లేదు. అదే సమయంలో మరో 15 నెలల్లో ఎన్నికలు ఎదుర్కొనేందుకు జగన్ రచిస్తున్న వ్యూహాల్ని పార్టీలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకోకపోవడం కాస్త నిరాశ కలిగిస్తున్నా అంతిమంగా జనంలోకి వెళ్లేందుకు రూపొందించిన గడప గడప కార్యక్రమం మాత్రం విజయవంతమైందనే చెప్పవచ్చు.

జగన్ వర్సెస్ చంద్రబాబు

జగన్ వర్సెస్ చంద్రబాబు

2022లోనూ వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు వార్ కొనసాగింది. ఇందులో వైఎస్ జగన్ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై ఈ ఏడాది కూడా భారీగానే ఫోకస్ పెట్టారు. వరుసగా కార్యక్రమాలు నిర్వహించడం, నిధుల కేటాయింపుతో కుప్పంలో వైసీపీ జెండా ఎగరేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నేతల్ని మూడేళ్లుగా కట్టడి చేయడంలో విజయవంతమైన వైసీపీ అధినేత.. ఈ ఏడాది మాత్రం ఆ పట్టు సడలించినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీకి చంద్రబాబు దూరం కావడంతో బహిరంగసభల్లో మాత్రమే ఇప్పుడు జగన్ ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. అలాగే చంద్రబాబును నాన్ లోకల్ గా ముద్ర వేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. తన ప్రభుత్వ విధానాలపై జనంలో తిరుగుతూ విమర్శలు చేస్తున్న చంద్రబాబుకు ఎప్పటికప్పుడు మంత్రులతో కౌంటర్లు వేయిస్తున్నారు. అయితే చంద్రబాబు-పవన్ పొత్తు సంకేతాలు జగన్ ను ఈ ఏడాది కాస్త ఇబ్బంది పెట్టాయి. తెలంగాణలో అవసరాల కోసం చంద్రబాబును దగ్గరికి తీసుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా జగన్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అయినా ఏమీ చేయలేని పరిస్దితి.

జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్

జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ను, ఆయన పార్టీ జనసేనను జగన్ బాగానే టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఇప్పటం గ్రామం విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు, చంద్రబాబుతో పవన్ పొత్తును జనంలోకి తీసుకెళ్లి ఎండగట్టేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. చంద్రబాబు, పవన్ , ఎల్లో మీడియాను దుష్టచతుష్టయంగా పేర్కొంటూ బహిరంగసభల్లో జగన్ తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. అయితే పవన్ కు బీజేపీతో పొత్తు నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి లభిస్తున్న మద్దతు జగన్ ను ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాలు జగన్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. క్షేత్రస్దాయిలో టీడీపీతో సమానంగా జనసేన నేతల్ని కూడా ప్రభుత్వం టార్గెట్ చేసి కేసులు పెట్టించింది. అయినా పవన్-చంద్రబాబు పొత్తుతో తమకు ఎలాంటి నష్టం లేదని జగన్ నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ కు కేంద్రం నుంచి లభిస్తున్న మద్దతు ఓ ఎత్తయితే క్షేత్రస్దాయిలో పెరుగుతున్న ఆదరణ కూడా జగన్ ను కలవరపెడుతోంది. అయినా సంక్షేమ మంత్రంతో పవన్ పై కచ్చితంగా పైచేయి సాధించవచ్చని జగన్ నమ్ముతున్నారు.

జగన్-బీజేపీ సంబంధాలు

జగన్-బీజేపీ సంబంధాలు

ఈ ఏడాది బీజేపీతో జగన్ సంబంధాలు కూడా ఎలాంటి పురోగతి లేకుండా యథాతథంగా ఉన్నాయి. ప్రధాని మోడీ రాష్ట్రానికి రెండుసార్లు వచ్చి వెళ్లారు. ప్రధాని మోడీ భీమవరం టూర్, విశాఖ టూర్లలో వైఎస్ జగన్ తానే హైలెట్ కావాలని ప్రయత్నించారు.ఇందుకోసం విపక్షాలను రానివ్వకుండా చూశారు. అయితే ప్రధాని మోడీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం జగన్ నుకాస్త నిరాశపరిచింది. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయం రాకపోగా.. నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్రమంత్రులు అవకాశం దొరికినప్పుడల్లా జగన్ సర్కార్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలకు మించి ఎన్డీయే సర్కార్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ జగన్ రాబట్టుకుంది ఏమీ లేదు. ఇవాళ కూడా ఢిల్లీ టూర్ కు వెళ్లిన జగన్.. మోడీ, షాలతో భేటీ కానున్నారు. ఈ ఏడాది కూడా పలుమార్లు ఇలా భేటీలు నిర్వహించినా ఫలితం మాత్రం దక్కకపోవడం నిరాశగా మారింది. అయితే కీలక అంశాల్లో మాత్రం వైసీపీ సర్కార్ కు బీజేపీ అండదండలు కొనసాగుతున్నాయి.

జగన్ గ్రాఫ్ పెరిగిందా ? తగ్గిందా

జగన్ గ్రాఫ్ పెరిగిందా ? తగ్గిందా


ఈ ఏడాది వైఎస్ జగన్ గ్రాఫ్ పెరిగిందా లేదా అన్నది చూడాలంటే మాత్రం పలు అంశాల్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఇందులో రాజకీయంగా చూసుకుంటే చంద్రబాబు-పవన్ రూపంలో ఇద్దరు ప్రత్యర్ధులు తనకు వ్యతిరేకంగా ఈ ఏడాది ఏకమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఇది కచ్చితంగా మైనస్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వ పాలన విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అలాగే కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం, అప్పుల విషయంలో కేంద్రం సహకరించకపోయినా బయట నుంచి తెచ్చుకోవడం, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు, శంఖుస్ధాపనలు చేయడం ద్వారా జగన్ సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలోనూ ఉన్నట్లు చెప్పుకోగలిగారు. మరోవైపు జనంలో సంక్షేమంపై విశ్వాసం సడలిపోకుండా చూసుకోవడం జగన్ కు ప్లస్ గా చెప్పుకోవచ్చు. మూడు రాజధానుల విషయంలో ఫలితం రాకపోయినా అభివృద్ధి వికేంద్రీకరణ ప్రయత్నాలు వెనుకబడిన సీమ, ఉత్తరాంధ్రలో సత్ఫలితాలు అందించాయి. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్నా దాన్ని క్యాష్ చేసుకోలేని స్ధాయిలో విపక్షాలు ఉండటం జగన్ కు కలిసి వచ్చే అంశమే.ఈ లెక్కన చూసుకుంటే జగన్ కు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు తప్పలేదు. కానీ గ్రాఫ్ విషయానికొస్తే మాత్రం యథాతథంగా కొనసాగుతున్నట్లు చెప్పుకోవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+