Year Ender 2025: కేంద్రంలో పెరిగిన ఏపీ ఇమేజ్..! నిధులు, ప్రాజెక్టుల వెల్లువ..!
గతేడాది ఏపీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని అందుకున్న చంద్రబాబు.. ఈ ఏడాది దాన్ని పతాకస్దాయికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా కేంద్రం వద్ద తమ పరపతిని బాగా పెంచుకున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రాజెక్టులు తీసుకురావడం, పదవులు తీసుకోవడం, గూగుల్ డేటా సెంటర్ వంటి సంస్థల్ని ఏర్పాటు చేయించుకోవడం వంటి పరిణామాలు కేంద్రంలో చంద్రబాబు పరపతికి నిదర్శనంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది సాధించిన విజయాల్ని ఓసారి చూద్దాం..
రాష్ట్రంలో కూటమి సర్కార్, కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో ఈ ఏడాది అందరికీ తెలిసొచ్చింది. ముఖ్యంగా ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ అత్యంత సమన్వయం పెంచుకోవడమే కాకుండా గతంతో పోలిస్తే అపాయింట్ మెంట్లు తీసుకునే విషయంలోనూ తమ పరపతి చాటుకున్నారు. దీంతో వరుసగా చంద్రబాబు, ఢిల్లీ పర్యటనలు చేయడం, కేంద్రమంత్రుల్ని కలవడం, రాష్ట్రానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఐటీ ప్రాజెక్టులు సాధించుకోవడం చూశాం. అలాగే రాజకీయంగా కూడా ఇరు ప్రభుత్వాలు పటిష్టంగా ఉండటం వీరికి కలిసొచ్చింది.

రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి సర్కార్ కీలకంగా భావిస్తున్న అమరావతి రాజధానితో పాటు విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఇతర ఐటీ ప్రాజెక్టులకు కేంద్రం సహకారం లభించింది. దీంతో అమరావతి రాజధానికి వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో నిధుల రాక ప్రారంభమైంది. అలాగే ఈ నిధులతో అమరావతిలో పనులు కూడా పరుగులు పెడుతున్నాయి. అలాగే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాకతో మరిన్ని డేటా సెంటర్లు, ఐటీ సంస్థలు శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు అవుతున్నాయి. విశాఖలో పెట్టుబడుల సదస్సులో వచ్చిన ప్రాజెక్టుల ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడానికీ ఇవే కారణమయ్యాయి.

మరోవైపు రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని ఆలస్యం లేకుండా ఎప్పటికప్పుడు తెచ్చుకోవడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం సక్సెస్ అయింది. అలాగే రైల్వే ప్రాజెక్టులు, పెండింగ్ లో ఉన్న ఆర్వోబీలు, ఆర్యూబీలు, వందేభారత్ ల విస్తరణ వంటి ఎన్నో నిర్ణయాలు ఈ ఏడాదిలోనే జరిగాయి. కొత్త ఏడాదిలోనూ ఇలాంటి సహకారం లభిస్తే రాష్ట్రానికి మరింత ప్రయోజనం చేకూరుతుందన్న అంచనాలున్నాయి. మరోవైపు రాష్టం తరఫున ఇప్పటికే కేంద్రంలో రెండు మంత్రి పదవులు సాధించుకున్న టీడీపీ.. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రను తాజాగా అదనపు సొలిసిటర్ జనరల్ గా నియమింపచేసుకోవడంలోనూ సక్సెస్ అయింది.












Click it and Unblock the Notifications