యువకుడి హత్య, తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి: నిందితుడి ఇంటికి నిప్పు, ఉద్రిక్తత
పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏలూరు మండలం శనివారపుపేట పంచాయతీ పరిధిలోని దళితవాడలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. గొడవలు ఎందుకని సర్దిచెప్పిన ఓ యువకుడు దారుణ హత్యకు గురికాగా, అతని మృతదేహాన్ని చూసిన కన్నతండ్రి గుండెపోటుతో కన్నుమూశాడు.
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉంటున్న తేరా సంజీవరావు(22) ట్రాక్టర్ డైవ్రర్‌గా పనిచేసేవాడు. ఇతనికి 6 నెలల క్రితమే వివాహమైంది. అతని భార్య ప్రస్తుతం గర్భిణి. సంజీవరావు తమ్ముడు రాకేష్ స్నేహితుడు పలిపే మారియూకు, అదే ప్రాంతానికి చెందిన లంకపల్లి శేఖర్‌తో ఆదివారం మధ్యాహ్నం గొడవ జరిగింది.
ఈ నేపథ్యంలో మారియూపై దాడి చేసేందుకు శేఖర్, అతని సోదరుడు చింతారావు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న సంజీవరావు గొడవలు ఎందుకంటూ వారిని వారించబోయాడు. దీంతో ఆగ్రహించిన చింతారావు, శేఖర్‌లు సమ్మెటతో సంజీవరావుపై దాడి చేసి చంపేశారు.

అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న సంజీవరావు తండ్రి నాగేశ్వరరావు(51)రక్తపుమడుగులో ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడి ఇంటికి నిప్పు, ఉద్రికత్త
సంజీవరావు హత్యకు, అతడి తండ్రి మృతికి కారణమైన నిందితుడి ఇంటికి గ్రామస్తులు సోమవారం నిప్పుపెట్టారు. ఇంట్లోని నిందితుడి తల్లి, చెల్లిలిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, గ్రామస్తులతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భారీగా మోహరించిన పోలీసులు, పరిస్థితిని సద్దుమణిగేలా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications