అరవకుండా నాలుక కోసి దోపిడీ: షాపులోకి దూసుకెళ్లిన లారీ, నలుగురి మృతి
కాకినాడ/ గుంటూరు : నగదు కోసం యువకుడిపై కత్తితో దాడి చేయడమేగాక అరవకుండా నాలుక కోసేసి దోపిడీకి పాల్పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం మఠం సెంటర్ లో ఓ యువకుడిపై దుండగులు నగదు కోసం కత్తితో దాడి చేశారు.
ఈ సమయంలో ఆ యువకుడు పెద్దగా కేకలు వేస్తుండడంతో నాలుక సైతం కోసేసి నగదును అపహరించారు. అయితే ఆ యువకుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు.
ఇదిలావుంటే, ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులో నలుగురు ఫాస్టర్లు కిడ్నాప్ అయ్యారు. వీరిని నిషిద్ధ మావోయిస్టులు కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని మల్లంపేట, తేగ, నర్సింగపేటల్లో గల నలుగురు ఫాస్టర్లు కిడ్నాప్‌కు గురయ్యారు.

అయితే, ఆ గ్రామాలు నిషిద్ధ మావోయిస్టులకు పట్టున్న గ్రామాలు కావడంతో వారే అపహరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వీరిని మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయాన్ని పోలీసులు నిర్ధారించలేదు.
ఇదిలావుంటే, ఓ లారీ దుకాణాల్లోకి దూసుకెళ్లడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో జరిగింది. మృతుల్లో ఓ మహిళ ఉంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ఒంగోలు నుమచి విజయవాడకు వెళ్తున్న లారీ శనివారం ఉదయం దుకాణాల్లోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications