డబ్బు కోసం పెద్దమ్మ నగలను ప్రియుడితో చోరీ చేయించిన ఇంజనీరింగ్ విద్యార్ధిని
అమరావతి: ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఒకే కాలేజీలో చదువుతున్నారు. వారి జల్సాలకు డబ్బు అవసరమైంది. సులభంగా డబ్బు సంపాదించడం ఎలా? అనే ఆలోచనతో దొంగతనాలు చేద్దామనుకున్నారు. కానీ ప్రేమికురాలు ఆమె పెద్దమ్మ బంగారాన్నే దోచుకుందామని ప్రియుడికి సలహా ఇచ్చింది.
అంతేకాదు ఎలా దోచుకోవాలో అనే విషయమై ఐడియా ఇచ్చింది. ఇంకేముంది ప్రియురాలి సలహాతో ప్రియుడు రెచ్చిపోయాడు. చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ చోరీ బయటపడింది. ప్రేమికులిద్దరూ ఇప్పుడు జైలు పాలయ్యారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 18 కాసుల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 13 అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం వసంతవాడలో వృద్ధురాలు కొప్పు అనంతలక్ష్మీని కత్తితో బెదరించి ఆమె నగలను పహరించిన నిందితుడిని, అతడి ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
ఏలూరు పవరుపేటకు చెందిన నందుల సరస్వతి స్థానిక ఓ కళాశాలలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఏలూరు తంగెళ్లమూడికి చెందిన జువ్వల పురుషోత్తం అదే కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి జల్సాలకు డబ్బు అవసరమైంది.
దీంతో పాటు పురుషోత్తంకు ద్విచక్రవాహనం కొనిపెట్టేందుకు సరస్వతి ఆమె బంగారు గొలుసు తాకట్టుపెట్టింది. డబ్బు కోసం వీరిద్దరూ గొలుసు చోరీలకు పాల్పడదామని భావించినా అది వీలుకాక విరమించుకున్నారు. ఈ క్రమంలోనే తన పెద్దమ్మ అయిన వసంతవాడకు చెందిన అనంతలక్ష్మి వద్ద ఉన్న నగలను దోచుకుందామని సరస్వతి తన ప్రియుడు పురుషోత్తంకు చెప్పింది.
అనుకున్న పథకం ప్రకారం సరస్వతి ఈనెల 13న వసంతవాడలో పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. బ్యాంకు ఖాతా తెరిచేందుకు వచ్చానని పెద్దమ్మకు చెప్పి ఆ రోజు రాత్రి అక్కడే ఉండేలా చేసుకుంది. వృద్ధురాలి పిల్లలు విదేశాల్లో ఉండటంతో ఇంట్లో ఆమె ఒంటరిగానే ఉంటుంది. ముందుగా అనుకున్న ప్రకారం.. 13న రాత్రి సరస్వతి ప్రియుడు పురుషోత్తంను వెనుక గుమ్మం నుంచి లోనికి రప్పించి పెద్దమ్మ ఉండే గదిలోకి పంపింది.
మరో గది నుంచి సరస్వతి పెద్దగా అరుస్తూ పెద్దమ్మా.. ఇద్దరు వ్యక్తులు నాపీక మీదకత్తి పెట్టి బెదిస్తున్నారు.. వారికి నగలు కావాలంట తొందరగా ఇచ్చేయ్.. లేదంటే చంపేస్తారంటూ భయపడినట్లు నటించింది. దీంతో కంగారుపడిన అనంతలక్ష్మి తన మెడలో ఉన్న గొలుసు, బంగారు గాజులుపురుషోత్తంకు ఇచ్చింది.
ఆ తర్వాత అతను అక్కడ నుంచి వెళ్లిపోయాడు. తనను పట్టుకున్న ఇద్దరు దొంగలు కూడా పారిపోయారని సరస్వతి పెద్దమ్మకు చెప్పంది. అనంతరం మరుసటి రోజున అనంతలక్ష్మీ చోరీ జరిగిన తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న సరస్వతితో పాటు అనంతలక్ష్మీని ఆరా తీశారు.
సరస్వతి మాటలు పొంతన లేకుండా ఉండటంతో ఆమెను అనుమాంచి తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. అయితే ఈ కేసును పోలీసులు రెండు రోజుల్లో ఛేదించడం విశేషం.












Click it and Unblock the Notifications