అలెర్ట్.. యువత భవితకు పెను ముప్పు.. భద్రత లేని ఉద్యోగాలపై షాకింగ్ నివేదిక!
ప్రపంచ వ్యాప్తంగా యువత భవిత డేంజర్ జోన్ లోకి వెళ్తోంది. ఉద్యోగాలు రాక, ఉద్యోగాలు వచ్చినా భద్రత లేక యువత ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యువతకు స్థిరమైన ఉపాధి ఇవ్వడం ఇప్పటికీ పెద్ద సమస్యగానే మిగిలిపోయింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ విడుదల చేసిన తాజా నివేదిక ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
29 ఏళ్లలోపు యువతలో దాదాపు 20 శాతం మంది విద్యలో గానీ, ఉద్యోగంలో గానీ, ఏ శిక్షణలో గానీ లేని నీట్ వర్గంలో ఉన్నారు. అంటే నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ ఆర్ ట్రైనింగ్ లో లేరు. వారికి చదువు, ఉద్యోగం, అందుకు కావాల్సిన ఎలాంటి శిక్షణ లేదు. గత రెండేళ్లలో యువత నిరుద్యోగ రేటు 12.4 శాతానికి చేరుకుంది.

ఆర్థిక మందగమనం, ఉద్యోగాల సృష్టి తగ్గడం, కృత్రిమ మేధస్సు ప్రభావం, సామాజిక భద్రత లేని పనులు ఇవన్నీ కలిసి యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
చాలామంది యువత ఒకే ఉద్యోగంతో సరిపెట్టుకోలేక పగలు ఒక పని, రాత్రి మరో పని చేస్తూ బతుకు తెరువు సాగిస్తున్నారు. ఎంట్రీ లెవల్, మధ్యస్థ నైపుణ్యాల ఉద్యోగాలు బాగా తగ్గుతున్నాయి.
క్లరికల్, సేల్స్, సర్వీస్ రంగాలు ఏఐ కారణంగా ప్రమాదంలో పడుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావంతో యువత ఉద్యోగాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
మహిళల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఉపాధి రేటులో పురుషులు 43.3 శాతం ఉంటే మహిళలు కేవలం 30.6 శాతం మాత్రమే ఉన్నారు. ఉద్యోగాలలో ఒత్తిడి తట్టుకోలేక డ్రాపౌట్ రేటు పెరగడం దీనికి ప్రధాన కారణం.
ఐఎల్ఓ ఈ ఆందోళన తగ్గించటం కోసం పలు కీలక సూచనలు చేసింది. సైన్స్, హెల్త్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో నైపుణ్యాలు పెంచాలి. నాణ్యమైన విద్య, అప్రెంటిస్షిప్లపై పెట్టుబడులు పెంచాలి. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి కూడా సామాజిక భద్రత విస్తరించాలి. యువతకు మంచి ఉపాధి కల్పించడం కేవలం సామాజిక బాధ్యత కాదు, దేశం చేసే తెలివైన పెట్టుబడి అని ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ అన్నారు.
మరి ఈ సూచనలు ప్రభుత్వాలు తీసుకుని తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే యువత భవిత బాగుంటుంది. లేదంటే వారి భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. అదే జరిగితే దేశ పురోగతి దెబ్బ తింటుంది.













Click it and Unblock the Notifications
