YS Avinash Reddy : సీబీఐకి చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన వైఎస్ అవినాష్ రెడ్డి...
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సీబీఐ.. దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు జూన్ 30తో ముగిసే అవకాశం ఉండటంతో ఈ కేసులో నిందితుడిగా చేర్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇవాళ విచారణకు రావాలని నిన్న నోటీసులు పంపింది.
హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఇవాళ విచారణకు రావాలంటూ సీబీఐ నిన్న పంపిన నోటీసులపై స్పందించిన వైఎస్ అవినాష్ రెడ్డి.. ఇవాళ విచారణకు హాజరవుతారని అంతా భావించారు. కానీ ఆయన చివరి నిమిషంలో సీబీఐకి ట్విస్ట్ ఇచ్చారు. ఇంత తక్కువ సమయంలో నోటీసు ఇస్తే హాజరు కావడం కష్టమని, నాలుగు రోజుల గడువు కావాలంటూ అవినాష్ రెడ్డి సీబీఐని కోరారు. ఈ మేరకు ఈ మెయిల్ ద్వారా ఓ లేఖ పంపినట్లు తెలుస్తోంది.

సీబీఐకి రాసిన లేఖలో పలు అంశాల్ని అవినాష్ రెడ్డి ప్రస్తావించారు. ఇప్పటికే ఫిక్స్ అయిన కార్యక్రమాలు ఉన్నాయని, ఇంత తక్కువ సమయంలో విచారణకు పిలిస్తే రావడం కష్టమని తెలిపినట్లు సమాచారం. అలాగే తనకు నాలుగు రోజులు గడువిస్తే విచారణకు హాజరవుతానని కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో సీబీఐ ఈ విజ్ఞప్తికి అంగీకరించినట్లు సమాచారం. సీబీఐ నుంచి ఈ మేరకు సమాధానం రావడంతో అవినాష్ రెడ్డి విచారణ వాయిదా పడినట్లయింది.
వాస్తవానికి ఇవాళ విచారణకు రావాలంటూ నిన్న సీబీఐ నోటీసులు పంపగానే వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించి సీబీఐని గడువు కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్నసాయంత్రమే సీబీఐకి లేఖ పంపినట్లు సమాచారం. అయితే ఈ ఉదయం వరకూ సీబీఐ నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన హైదరాబాద్ లోనే వేచి ఉన్నట్లు తెలుస్తోంది.చివరికి ఇవాళ సీబీఐ నుంచి సమాధానం రావడంతో ఆయన తన రెగ్యులర్ కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications