జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ బరిలోకి దిగుతున్నారు. దీనిలో భాగంగానే 175కు 175 నియోజకవర్గాలు గెలవడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సిద్ధం పేరిట సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి తెర లేపారు. సిద్ధం పేరిట నాలుగు సభలను నిర్వహించిన జగన్.. ఆ వెంటనే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు జగన్ నిర్వహించిన ఈ రెండు కార్యక్రమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
ఈ రెండు కార్యక్రమాలకు పార్టీ ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన లభించింది. దీంతో మూడో విడత ప్రచారానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన వెంటనే మూడో విడత ప్రచారానికి జగన్ రెడీ అవుతున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం సొంత నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటించారు.

భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. అనంతరం భారీ ర్యాలీ ద్వారా నామినేషన్ దాఖలు చేశారు. జగన్ నియోజకవర్గాల పర్యటనలో ఉంటారు కాబట్టి పులివెందులలో ఆయన భార్య వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. స్థానిక వైసీపీ నేతలతో కలిసి వైస్ భారతి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వైఎస్ భారతికి ఎన్నికల ప్రచారం నిర్వహించడం కొత్తేం కాదు.
2014, 2019 ఎన్నికలలో కూడా పులివెందులలో ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు. పులివెందులతో పాటు, కడప పార్లమెంట్ పరిధిలోనూ పలు నియోజకవర్గాలలో భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో జగన్‌పై పోటీ చేసిన టీడీపీ నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరి పార్టీ తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు వైఎస్ కుటుంబ సభ్యులు సైతం జగన్ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి రెడీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications