రేపే సిద్ధం చివరి సభ- జగన్ ప్రసంగంపై ఉత్కంఠ-విపక్షాల పొత్తుల వేళ...
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కొక్కటిగా జతకడుతున్నాయి. ప్రధాన విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనకు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తోడయింది. దీంతో ఈ మూడు పార్టీల కూటమి నుంచి జగన్ కు ఎన్నికల సవాల్ ఎదురుకాబోతోంది. గతంలో 2014 ఎన్నికల్లో ఇదే కూటమి నుంచి సవాల్ ఎదుర్కొన్న జగన్.. అధికారానికి దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి ఇదే కూటమిని ఎదుర్కోవాల్సిన పరిస్ధితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై జగన్ క్యాడర్ కు దిశానిర్దేశం చేసేందుకు సిద్దమయ్యారు.
ఇప్పటికే వైసీపీ క్యాడర్ ను ఉత్సాహపరిచేందుకు భీమిలి, ఏలూరు, రాప్తాడులో మూడు సిద్ధం సభల్ని నిర్వహించిన జగన్..ఇప్పుడు అద్దంకిలో చివరిదైన నాలుగో సిద్ధం సభ నిర్వహణకు సిద్దమయ్యారు. రేపు మేదరమెట్ల వద్ద నిర్వహించే ఈ సభకు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 15 లక్షల మందిని రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగం కీలకంగా మారింది. ఇప్పటివరకూ టీడీపీ-జనసేన కూటమి గురించే మాట్లాడిన జగన్.. తొలిసారి అద్దంకిలో బీజేపీపై మాట్లాడబోతున్నారు.

అద్దంకిలో జరిగే సిద్ధం సభతో ఈ సిరీస్ ముగియబోతోంది. దీంతో చివరిదైన ఈ సభలో జగన్ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో జగన్ తన ఐదేళ్ల పాలన ప్రగతిని వివరించబోతున్నారు. అలాగే గత ప్రభుత్వానికీ, తమ ప్రభుత్వానికీ తేడా వివరిస్తారు. దీంతో పాటు టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులతో వస్తున్నందున ఎలా ఎదుర్కోవాలో తన ప్రసంగంలో జగన్ క్యాడర్ కు వివరించబోతున్నారు.

ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు ఈ పొత్తును కొత్త సీసాలో పాత సారాగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ బూత్ లెవల్ నుంచీ తాము తీసుకుంటున్న జాగ్రత్తల్ని క్యాడర్ కు వివరించి ఈ పొత్తు వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పబోతున్నారు. అలాగే ఈ పొత్తు వల్ల నష్టాల్ని, తమ ప్రభుత్వం తిరిగి రాకపోతే జరిగే నష్టాల్ని జనంలోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేయబోతున్నారు. చివర్లో సిద్దం తర్వాత తాము ప్రారంభించే "నా కల" కార్యక్రమాలను జగన్ ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications