హోరాహోరీగా ఢీకొడుతున్న వైఎస్ జగన్, చంద్రబాబు!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 2024లో జరగబోయే ఎన్నికలు అధికార వైసీపీకి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. రెండు పార్టీలకు తప్పనిసరిగా గెలవాలి.. గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఏ పార్టీ ఓటమిపాలైనా ఆ తర్వాత జరిగే రాజకీయ పరిణామాలను తట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతుంది. అందుకే ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు హోరాహోరీగా తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు.

ఓటర్లు చేజారిపోకుండా సంక్షేమ పథకాలు
తెలుగుదేశం పార్టీ బలపడకుండా ఉండేందుకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ శతథా ప్రయత్నిస్తున్నారు. తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. మరోవైపు ఓటర్లు చేజారిపోకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. మహానాడు, మినీ మహానాడులు, బాదుడే బాదుడు కార్యక్రమాలకు భారీగా ప్రజల హాజరవడంతో టీడీపీలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

బలపడ్డామంటున్న తెలుగు తమ్ముళ్లు?
వైసీపీ కోరుకున్న స్థాయిలో మాత్రం టీడీపీ బలహీనపడలేదని, మేం ఇంకా బలపడ్డామంటూ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అధికార పార్టీగా ఉండే వ్యతిరేకతను అధిగమించడానికి జగన్ ఒకే ఒక ఆయుధం సంక్షేమ పథకాలు. రేపటి ఎన్నికల్లో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే ఓటింగ్ శాతం పెంచుకోవడంపై దృష్టిసారించారు. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎలా ఉంది? ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? అని తెలుసుకునేందుకు తనకున్న మార్గాలతోపాటు ఐప్యాక్ ద్వారా సర్వే చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నారు.

5 జిల్లాల్లో చెటటోడ్చాలి
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నిర్వహించుకున్న సర్వేలో 5 జిల్లాల్లో పార్టీ పూర్తిగా చెమటోడ్చాల్సి వస్తుందని తేలింది. వాటిల్లో ఉమ్మడి అనంతపురం, ప్రకాశం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలున్నాయి. అందులో రెండు జిల్లాలు ఉత్తరాంధ్రవే ఉన్నాయి. టీడీపీ-జనసేన కలిస్తే తూర్పుగోదావరి జిల్లాలో బలం తగ్గుతున్నట్లు తేలింది. ప్రస్తుతం టీడీపీకున్న స్థానాలతోపాటు మూడింట రెండొంతులు తాము బలంగానే ఉన్నామనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన ఖరారు చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇరు పార్టీల నేతలు పై చేయిగా ఉండేందుకు ఒకరి ఎత్తుకు మరొకరు పై ఎత్తు వేసుకుంటూ రావల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎవరిది పై చేయిగా నిలవనుందనేది ప్రజలు తేల్చనున్నారు.












Click it and Unblock the Notifications