ఆ విషయంలో... వైఎస్ జగన్, చంద్రబాబుది ఒకే మాట?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇద్దరివీ ఉత్తర, దక్షిణ ధ్రువాలు. ఎక్కడా, ఏ అంశంలోను కలవడానికి అవకాశం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధికారం కోసం మదగజాల్లా హోరాహోరీగా పోరాడుకుంటున్నారు. అటువంటి వీరిద్దరూ ఒక విషయంలో మాత్రం ఒకే మాటమీద ఉన్నారంటే చిత్రంగా లేదు. అదేమిటంటే.. రాబోయే ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేసే విధానం. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు అభ్యర్థులకు అంగబలం, అర్థబలం చూస్తున్నాయి.

ఆ రెండూ ఉంటేనే..
ఆ రెండూ ఉంటేనే రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థులతో తలపడటానికి వీలవుతుంది. ఏ పార్టీ తరఫున టికెట్ కావాలన్నా మొదటి ప్రాధాన్యత.. అంగబలం, అర్థబలం. ఈ రెండు లక్షణాలు పుష్కలంగా ఉన్నవారే రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు. ప్రజల్లో మంచి పేరుండాలి.. ఖర్చుపెట్టడానికి కోట్లరూపాయలుండాలి. అటువంటివారే రేపటి అసెంబ్లీలో అడుగుపెట్టగులుగుతారు.

తెలుగుదేశంలో క్లిష్ట పరిస్థితి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఈ రెండూ ఉన్న అభ్యర్థులకు కొదవ లేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీనే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. వాస్తవానికి ప్రతి నియోజకవర్గంలోను, లేదంటే ప్రతి జిల్లాలోను మినీ మహానాడు నిర్వహించాలనుకొని ఖర్చులకు అంత ధైర్యం చేయలేక మిన్నకుండిపోయింది. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి కురబ సామాజికవర్గానికి చెందిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కోట్లరూపాయలు ఉంటేనే టీడీపీ టికెట్ దక్కుతుందని చేసిన వ్యాఖ్యపై దుమారం రేగింది. టికెట్లపై ఎవరూ ఆశలు పెట్టుకోవద్దని చెప్పారు.

ఇరు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం
రానున్న ఎన్నికలు తెలుగుదేశం, వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలిచినవారే నిలవగలుగుతారు. అందుకే వాటి అధినాయకత్వాలు అన్నివిధాలుగా సరిజూసుకొనే అభ్యర్థులను రంగంలోకి దించాలనుకుంటున్నాయి. ఇటువంటి విషయంలో వైఎస్ జగన్ కు ఎటువంటి మొహమాటం ఉండదు. అంతిమంగా పార్టీయే ఫైనల్. చంద్రబాబు కూడా తాను మారానని చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా అభ్యర్థులను ముందుగానే ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఆయన కూడా మొహమాటానికి పోకుండా ఉంటేనే ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాధ్యపడుతుంది.. లేదంటే వార్ వన్ సైడ్ అవుతుంది.












Click it and Unblock the Notifications