YS Jagan Padayatra: జగన్ పాదయాత్రకు ముహుర్తం ఫిక్స్..! స్వయంగా ప్రకటన..!
ఏపీలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) మరో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రెస్ మీట్లు, పర్యటనల ద్వారా బలంగా తన వాయిస్ వినిపిస్తున్న జగన్.. ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లి తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం వచ్చే ఏడాది పాదయాత్ర మొదలుపెట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఇవాళ పర్చూరు పర్యటనలో పార్టీ క్యాడర్ కు వెల్లడించారు.
2027 సెప్టెంబర్-అక్టోబర్లో పాదయాత్ర చేపడతానని వైఎస్ జగన్ ఇవాళ ప్రకటించారు. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జగన్.. ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమానికి సంబంధించిన ముహుర్తాన్ని స్వయంగా వెల్లడించారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో పాదయాత్రను ప్రారంభిస్తానని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలతో విస్తృతంగా మమేకమయ్యేలా సాగనున్న ఈ పాదయాత్రపై, పార్టీ శ్రేణులకు ఈ ప్రకటన స్పష్టతనిచ్చింది.

గతంలో 2019 ఎన్నికల కోసం 2018 నుంచి మొదలుపెట్టి 3800 కిలోమీటర్ల మేర రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ అనుకున్న ఫలితం సాధించారు. అప్పటి టీడీపీ కూటమి సర్కార్ పాలనకు వ్యతిరేకంగా జనంలోకి వెళ్లిన జగన్.. కేంద్రంతో కలిసి చంద్రబాబు సర్కార్ రాష్ట్రానికి ఎలా అన్యాయం చేస్తోందో వివరించారు. దీంతో జనం ఆయన మాటల్ని నమ్మారు. ఫలితంగా 2019లో వైఎస్సార్సీపీ ఏకంగా 151 సీట్ల భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అనంతరం ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపిన వైఎస్ జగన్ 2024లో ఓటమి పాలైనా వెరవకుండా తన పోరాటం కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో మరోసారి పాదయాత్ర ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరించాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఈ పాదయాత్రకు ప్లాన్ చేశారు.













Click it and Unblock the Notifications
