90 ఏళ్ల మ్యాథ్స్ చిక్కుముడిని 88 గంటల్లో విప్పిన ఏఐ
గణిత శాస్త్ర ప్రపంచాన్ని దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా తీవ్ర వేదనకు గురిచేస్తున్న అత్యంత సంక్లిష్టమైన 'నేవియర్-స్టోక్స్' (Navier-Stokes) సమీకరణ సమస్యను తమ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పరిష్కరించిందని ఓపెన్ ఏఐ (OpenAI) సంచలన ప్రకటన చేసింది. ద్రవాలు, వాయువుల కదలికలను వివరించే ఈ సమీకరణాలు విమానాల రెక్కల డిజైనింగ్, వాతావరణ అంచనాలు, మానవ శరీరంలో రక్తం ప్రసరించే తీరును అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
అయితే ఈ ద్రవ కదలికల్లో ఎప్పుడైనా సింగ్యులారిటీ ఏర్పడుతుందా లేదా అనే ప్రశ్న దశాబ్దాలుగా మిస్టరీగానే మిగిలిపోయింది. క్లే మ్యాథమెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ మిల్లేనియం ప్రైజ్ కింద మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8.3 కోట్లు) బహుమతి ప్రకటించిన ఈ గడ్డు సమస్యను సాధించడానికి ఓపెన్ ఏఐ ఏకంగా 10 వేల ఏఐ ఏజెంట్లను రంగంలోకి దించింది. అవి రాత్రింబవళ్లు శ్రమించి కేవలం 88 గంటల వ్యవధిలోనే ఆధారాలతో కూడిన పరిష్కారాన్ని రాబట్టడం విశేషం.

చరిత్ర సృష్టించిన వేళ వెలుగుచూసిన డేటా వివాదం!
ఈ అద్భుత ఘనతతో అంతర్జాతీయంగా పండగ చేసుకోవాల్సిన ఓపెన్ ఏఐకి ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఒక ఊహించని షాక్ తగిలింది. న్యూయార్క్ యూనివర్సిటీ గణిత ప్రొఫెసర్ ట్రిస్టన్ బక్‌మాస్టర్, తన పరిశోధనలను ఓపెన్ ఏఐ దొంగిలించిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తాను, తన సహచర శాస్త్రవేత్త లెవెంట్ అల్పోగె గత కొన్ని నెలలుగా ఇదే అంశానికి దగ్గరగా ఉన్న ఒక సమస్యపై పరిశోధనలు చేస్తూ, తమ నోట్స్-కోడింగ్‌ను ఓపెన్ ఏఐకి చెందిన 'కోడెక్స్' టూల్ లో నిక్షిప్తం చేశామని ఆయన వివరించారు.
తాము అందించిన అన్‌పబ్లిష్డ్ డేటాను ఉపయోగించే.. ఓపెన్ ఏఐ మోడల్స్ ట్రైనింగ్ అయ్యాయని, అతి తక్కువ సమయంలో ఈ సమస్యను సాధించాయని ఆయన ఆరోపించారు. ఈ విషయమై తాను ప్రశ్నించగా కంపెనీ ప్రతినిధుల నుంచి సరైన సమాధానం రాలేదని, పైగా మీడియా ముందుకు వెళ్తే "కెరీర్ నాశనం అవుతుంది" అని పరోక్షంగా హెచ్చరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోపణలను ఖండించిన ఓపెన్ ఏఐ
ప్రొఫెసర్ బక్‌మాస్టర్ చేసిన ఆరోపణలను ఓపెన్ ఏఐ తీవ్రంగా ఖండించింది. ఏఐ మోడల్ శిక్షణ కోసం సదరు శాస్త్రవేత్తల వ్యక్తిగత డేటాను గానీ, లీక్ అయిన సమాచారాన్ని గానీ తాము ప్రాసెస్ చేయలేదని స్పష్టం చేసింది. ప్రొఫెసర్ అనుసరించిన పరిశోధనా విధానం, తమ ఏఐ ఏజెంట్లు పరిష్కరించిన విధానం పూర్తిగా వేరని ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మాన్ వివరణ ఇచ్చారు.
అయితే తమ ఉత్పత్తులు వాడే క్రమంలో సేకరించిన గుర్తింపు లేని సాధారణ సమాచారం మోడల్స్ అభివృద్ధికి ఉపయోగపడి ఉండవచ్చనే అవకాశాన్ని మాత్రం సంస్థ పూర్తిగా తోసిపుచ్చలేకపోయింది. అంతేకాకుండా మిల్లేనియం ప్రైజ్ కింద లభించే ఆ మిలియన్ డాలర్ల బహుమతి మొత్తాన్ని కూడా తాము స్వీకరించబోమని కంపెనీ స్పష్టం చేసింది.
గణిత మేధావుల్లో పెరిగిన ఆందోళన.. సిద్ధాంతంపై ఇంకా తేలని లెక్క!
ప్రస్తుతానికి క్లే మ్యాథమెటిక్స్ ఇన్‌స్టిట్యూట్ ఓపెన్ ఏఐ అందించిన పరిష్కారాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. సాధారణంగా పరిశోధకులు పరిగణనలోకి తీసుకోని కొన్ని అంశాలను ఆధారం చేసుకుని ఏఐ ఈ సమీకరణాన్ని సాధించిందని, కాబట్టి ఇది పూర్తిస్థాయి గెలుపు కిందకు రాదని పలువురు గణిత శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు పరిశోధకులు తమ రాత్రింబవళ్ల శ్రమను, అన్‌పబ్లిష్డ్ డేటాను అత్యాధునిక ఏఐ సాధనాల్లో ఉంచడం ఎంతవరకు సురక్షితమనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ప్రముఖ గణిత మేధావి టెరెన్స్ తావో ఈ పరిస్థితిపై స్పందిస్తూ "జిమ్‌లో మీ కోసం బరువులు ఎత్తే యంత్రాలు ఉన్నట్లే ఏఐ పనిచేస్తోంది, కానీ అది మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాకూడదు" అని హితవు పలికారు.














Click it and Unblock the Notifications
