Ys Jagan : ఎమ్మెల్యేలూ గేరు మార్చండి- 175 సాధ్యమేనన్న జగన్-రెండు కీలక టాస్క్ లు..
ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలతో గడప గడపకూ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన ఎమ్మెల్యేలకు కీలక దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 175 సీట్లకు 175 గెలిచేందుకు చేయాల్సిన కార్యక్రమాలను ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. అలాగే పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని తేల్చిచెప్పేశారు.
రాష్ట్రంలోని 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. సర్వేల ఆధారంగా టికెట్లు ఉంటాయని తెలిపారు. టికెట్ రాని వాళ్ళు అసంతృప్తికి గురికావద్దని జగన్ ముందే చెప్పేశారు. వై...ఏపీ నీడ్స్ జగన్ అనే కొత్త కార్యక్రమంలో ఎమ్మెల్యేలంతా పాల్గొనాలని జగన్ ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనాలన్నారు.

రాబోయే ఆరు నెలలు చాలా ముఖ్యమని సీఎం జగన్ ఈ భేటీలో ఎమ్మెల్యేలకు సూచించారు. గేర్ మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్నారు. ప్రజల్లో పార్టీపై పొజిటివ్ ఉందని జగన్ ఎమ్మెల్యేలకు తెలిపారు. అందుకే ఇప్పటివరకూ ఫలితాలు బావున్నాయన్నారు. కాబట్టి తాను నిర్దేశించిన తాజా కార్యక్రమాలపైనా మరింత ఎక్కువగా దృష్టి పెట్టాలని కోరారు. ఇంకా చెప్పాలంటే గేర్ మార్చాలని జగన్ కోరారు.
అసెంబ్లీ సమావేశాల తర్వాత రెండు ప్రధాన కార్యక్రమాలు అమలు చేయాలని సీఎం జగన్ సూచించినట్లు అసెంబ్లీలో ప్రభుత్వ ఛీఫ్ విప్ ప్రసాదరాజు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జనంలోకి తీసుకువెళ్లాలని సీఎం సూచించారన్నారు. ఈ నెల 29న జగనన్న సురక్ష కార్యక్రమం సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు.
45 రోజుల పాటు జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందన్నారు. రెండో కార్యక్రమంగా వై జగన్ నీడ్స్ అనే కార్యక్రమం ఉంటుందని ప్రసాదరాజు తెలిపారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.రాబోయే రెండు నెలల్లో ఈ కార్యక్రమాలు చెయ్యాలని జగన్ నిర్ణయించారని ప్రసాదరాజు తెలిపారు.












Click it and Unblock the Notifications