బాబు పాలన వద్దు: 'ఐదేళ్ల క్రితం నేను, అమ్మ మాత్రమే' వైసీపీ ఎలా ఎదిగిందంటే!
అమరావతి: వైసీపీలోని అన్ని స్థాయిల్లోని నేతలూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లాలని, టీడీపీ చేస్తున్న అవినీతిని విడమరచి ప్రజలకు చెప్పాలని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవాడలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా వైయస్ జగన్ పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రాథమిక ఉపన్యాసం చేశారు. ఐదేళ్లుగా ప్రజల తరుపున ప్రతి క్షణం పోరాడుతున్నామని వైయస్ జగన్ అన్నారు. వైసీపీలో ఐదేళ్ల క్రితం విజయమ్మ, తాను మాత్రమే ఉన్నట్లు ఆ తరువాత పార్టీ అంచెలంచెలుగా ఎదిగిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 18 మంది ఎమ్మెల్యేలకు, ఆ తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీల స్థాయికి పెరిగిందన్నారు. ఆ తర్వాత 45 శాతం ఓట్ల షేరుతో కోటి 30 లక్షల మంది ఆదరణ పొందామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మీ అందరి కృషి, సహాయ సహకారాల వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు.
ఈ పార్టీ మనది, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని అన్నారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై పోరాడుడుతూ ప్రజల గొంతుకలా కావాలని పిలుపునిచ్చారు.
మళ్లీ రాజన్న రాజ్యం కోసం నిరంతరం పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కోట్లాది రూపాయలను గుమ్మరించి వైసీపీ నేతలను లోబరచుకుందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు పాలన ఇక వద్దు అని ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలోనే తామంతా విజయవాడలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పరచినట్లు ఆయన పేర్కొన్నారు.
'చంద్రబాబు కుయుక్తులను ఏవిధంగా అధిగమించాలో చర్చిద్దాం' అని ఈ సందర్భంగా జగన్ అన్నారు. వైసీపీ ప్రజల గొంతుక ఎలా కావాలో మేధామధనం చేసుకుందామని జగన్ స్పష్టం చేశారు. వివిధ అంశాలపై పార్టీలోని పెద్దలు, నాయకులతో చర్చించి, దశదిశ నిర్దేశించుకుందామని అన్నారు.
త్వరలో ప్రారంభమయ్యే 'గడప గడపకూ' కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలను సమావేశం ముగిసేలోగా ఖరారు చేసి తెలియజేస్తామని వివరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ఈ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
జగన్ ప్రసంగం ముగిసిన తర్వాత వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.












Click it and Unblock the Notifications