కలచివేసిందన్న జగన్: బాలకృష్ణ, చిరు దిగ్భ్రాంతి
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త కలచి వేసిందని ఆయన అన్నారు. ప్రమాదంలో పిల్లలు సహా అనేకమంది చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా అనంతపురం జిల్లాలో మడకశిర నుంచి పెనుకొండ వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 14మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి వైయస్ జగన్ బుధవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్తారు.

అనంతపురం జిల్లాలో పల్లె వెలుగు బస్సు ఘోర ప్రమాద ఘటనపై కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి బుధవారం హైదరాబాదులో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కొక్కరికి రూ. 15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బస్సు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అలాగే ఈ ప్రమాదంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రధాని సంతాపం
బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications