జగన్ లిస్ట్‌లో రోజా సహా టాలీవుడ్, ఇతర ప్రముఖులు
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దాదాపు 95 శాతం మంది అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసింది. సీమాంధ్ర ప్రాంతం పైనే ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దృష్టి సారించింది. సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో ఎక్కువ మంది అభ్యర్థులను దాదాపు ఖరారుచేశారు. అందులో ఎనిమిది మంది డాక్టర్లు, ముగ్గురు నటులు ఉన్నారు. సగం మందికి పైగా మొదటిసారి పోటీ చేయనున్నారు.
సమాచారం మేరకు... టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తనయ నన్నపనేని సుధ వినుకొండ నుండి పోటీ చేసే అవకాశముంది. అయితే, ఆమెకు ఇతర అభ్యర్థుల నుండి గట్టి పోటీ ఉంది. ప్రముఖ నటి రోజా చిత్తూరు జిల్లా నగరి నుండి, ప్రముఖ నిర్మాత చెంగల వెంకట్రావు పాయకరావు పేట నుండి, మరో నిర్మాత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నుండి పోటీ చేయనున్నారు.

మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, ఎమ్మెల్యే సుజన కృష్ణ రంగా రావు, మాజీ ఎంపి భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తదితరుల కుటుంబాలకు ఒకటికి మించి టిక్కెట్లు జగన్ పార్టీ నుండి దక్కనున్నాయని తెలుస్తోంది.
మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నుండి, ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఉదయగిరి నుండి పోటీ చేయనున్నారు. పెద్ది రామచంద్రా రెడ్డి పుంగనూరు నుండి, అతని తనయుడు మిథున్ రెడ్డి రాజంపేట నుండి లోకసభకు పోటీ చేసే అవకాశముంది.
శ్రీకాకుళం నుండి ధర్మాన ప్రసాద రావు, ఆయన తనయుడు కృష్ణదాసు నరసన్నపేట నుండి పోటీ చేస్తారు. భూమా నాగి రెడ్డి నంద్యాల్ నుండి అసెంబ్లీకి, ఆయన సతీమణి ఆళ్లగడ్డ నుండి పోటీ చేయనున్నారు. ఆమె సోదరుడు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు టౌన్ నుండి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బేబీ నయన విజయనగరం పార్లమెంటుకు, ఆమె సోదరుడు రావు సుజయ కృష్ణ రంగారావు బొబ్బిలి నుండి పోటీ చేయనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయోధ్య రామి రెడ్డి నరసన్నపేట నుండి ఎంపీగా పోటీ చేయనున్నారు. ఆయన సోదరుడు ఆల్ల రామకృష్ణా రెడ్డి మంగళగిరి నుండి పోటీ చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications