మోడీ, బాబు ఏమన్నారో చూడండి: వీడియోను ప్రదర్శించిన జగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: రాష్ట్రాన్ని విభజించినప్పుడు లోకసభలో చోటు చేసుకున్న పరిస్థితులే శుక్రవారం ప్రత్యేక హోదా విషయంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్సించారు. ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై మాట్లాడిన వీడియోను ఆయన శనివారం మీడియా సమావేశంలో విడుదల చేసి చూపించారు.

నరేంద్ర మోడీ స్వయంగా ఎన్నికల ప్రచార సభలో ప్రత్యేక హోదా ఇవ్వడమే కాకుండా దాన్ని పదేళ్లకు పొడగిస్తామని చెప్పారని జగన్ గుర్తు చేశారు. దాన్ని మోడీ చెప్పడం, వెంకయ్య నాయుడు తెలుగులోకి అనువాదం చేయడం చూశామని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మాట మారుస్తున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు కూడా పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగారని, క్రమంగా ప్రత్యేక హోదా సంజీవని కాదని ప్లేటు మార్చారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు కోట్ల రూపాయలు ఎర చూపి సూట్ కేసుల్లో ఇస్తూ దొరికిపోయిన తర్వాత చంద్రబాబు ప్లేటు ఫిరాయిస్తూ వచ్చారని ఆయన అన్నారు. ఆ ఉదంతం బయటపడిన మరుక్షణం నుంచే చంద్రబాబు మాట మారుతూ వచ్చిందని ఆయన అన్నారు.

ఆ తర్వాత మోడీని రాజధాని శంకుస్థాపనకు పిలిచారని, ఆ రోజు మోడీని ప్రత్యేక హోదా చంద్రబాబు అడుగుతారని అనుకున్నామని, కానీ అడగలేదని, అలా అడగలేని పరిస్థితిలో పడిపోయారని ఆయన అన్నారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త కాదంటుందా అని కూడా ప్రత్యేక హోదాపై చంద్రబాబు అన్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు అడగలేనప్పుడు బిజెపి ఇవ్వలేమనే పరిస్థితికి వెళ్లిపోయారని, దానికి చంద్రబాబు వైఖరి కారణమని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏమన్నారో చూడాలని అంటూ అందుకు సంబంధించిన వీడియోను కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రదర్శించారు.

ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వెంకయ్య నాయుడు చెప్పిన మాటలను కూడా ఆయన తప్పు పట్టారు. ప్రత్యేక హోదాపై మర్నాడే తనను ఎంపీలు ఎలా సాధ్యమని అడిగారని, అలా అడగడం తప్పని తెలిసిందని వెంకయ్య నాయుడు అన్నారని, మర్నాడే ఎంపీలు అలా అడిగినప్పుడు ఎన్నికల ప్రణాళికలో ఎలా చేర్చారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాను నీరు గారుస్తూ, రాష్ట్ర ప్రజలను ఫణంగా పెడుతూ పథకం ప్రకారం డ్రామాలు ఆడుతూ వచ్చారని, చంద్రబాబు అలా తయారయ్యే పరిస్థితి వచ్చిందని, దాంతో హోదా ఇవ్వలేమని బిజెపి చెప్పగలిగిందని ఆయన అన్నారు.

YS Jagan blames Modi and Chandrababu on special status to AP

అలా చెప్పిన తర్వాత కూడా బిజెపికి మద్దతిస్తామని చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం చెప్పలేదు కాబట్టి ఎపికి హోదా ఇవ్వలేకపోతున్నామని జైట్లీ అనడం ఆశ్చర్యంగా ఉందని, ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నామని అంటున్నారని, రాష్ట్రాల మధ్య తేడా చూపడం లేదని అంటూనే అలా అన్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయం ఆర్థిక సంఘానికి సంబంధం లేదని అన్నారు.

రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో 2014లో లోకసభలో ఎంపీలను బయటకు పంపించేసి, టీవీ ప్రసారాలను కట్ చేసి, బ్లాకవుట్ చేశారని, శుక్రవారం ప్రత్యేక హోదా విషయంలో కూడా అదే తరహాలో ఖూనీ చేశారని ఆన అన్నారు. అరుణ్ జైట్లీ అత్యంత దారుణంగా మాట్లాడారని ఆయన అన్నారు ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పడానికి బిజెపి కుంటిసాకులు వెతుకుంటే, చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరో వైపు బిజెపి అల్టిమేటం ఇవ్వలేకపోయారని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలా, వద్దా అనే విషయం ప్రధాని చేతుల్లోనే ఉందని, ఎగ్గిక్యూటివ్ నిర్ణయం కాబట్టే వాజ్‌పేయి ప్రభుత్వం ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చారని, మన్మోహన్ సింగ్ మంత్రివర్గం ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆర్థిక సంఘానికి ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. ముంపు మండలాలను ఎపిలో కలపడం, విద్యుత్తు కేంద్ర కేటాయింపులను పంచడం అనే విషయాలపై కూడా ఆ రోజు మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్ణయం కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలని మంత్రివర్గం ఆర్థిక సంఘానికి ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. చంద్రబాబు సిఎం అయిన తర్వాత రెండు నెలల పాటు 13వ ఆర్థిక సంఘం ఉందని, ప్రణాళిక సంఘం తర్వాత నీతి అయోగ్ డిసెంబర్‌లో వచ్చిందని, తొమ్మిది నెలల పాటు 13వ ఆర్థిక సంఘంం ఉందని, అయినా చంద్రబాబు గానీ మోడీ గానీ పట్టించుకోలేదని ఆయన అన్నారు. పద్ధతిప్రకారం రాష్ట్రాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రజలను బిజెపి, టిడిపి మోసం చేస్తున్నందుకు నిరసనగా ఆగస్టు 2వ తేదీన రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి చేకూరే అదనపు ప్రయోజనాల గురించి ఆయన వివరించారు. అటువంటి రాయితీలు వచ్చినప్పుడే పెద్ద యెత్తున పెట్టుబడులు వస్తాయని, చంద్రబాబు పెట్టుబడుల కోసం విదేశాలు పర్యటించాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రత్యేక హోదాను అమలు చేయించాల్సిన చంద్రబాబు మోసం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన అన్నారు.

రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన మాటలపై నిలబడాలని, మాటలపై నిలబడని నాయకులను ప్రజలు నిలదీస్తారనే పరిస్థితి రావాలని, అప్పుడే రాజకీయాలు మెరుగవుతాయని ఆయన అన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం గురించి రాజ్యసభలో టిడిపి, బిజెపి సభ్యులు మాట్లాడలేదని ఆయన అన్నారు. బాబు వచ్చిన తర్వాత జాబ్‌లు రాలేదని, ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వచ్చి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు.

లక్షన్నర కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు కాబట్టే చంద్రబాబు బిజెపిని ప్రత్యేక హోదా గురించి అడిగే పరిస్థితిలో లేరని, అడిగితే కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశిస్తుందని భయపడుతున్నారని ఆయన అన్నారు. అవినీతి జరుగుతోంది కాబట్టే చంద్రబాబు మోడీని అడిగే పరిస్థితిలో లేరని, మంత్రులను కేంద్ర మంత్రివర్గం నుంచి ఉపసంహరించుకునే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు.

ఇంగ్లీషులో చంద్రబాబు మీడియా సమావేశం పెట్టే స్థితిలో లేరని, పెడితే మోడీకి తెలుస్తుంది కాబట్టి పెట్టడం లేదని, అలా పెడితే విచారణకు ఆదేశిస్తారు, చంద్రబాబు జైలుకు వెళ్తారని ఆయన అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress president YS Jagan lashed out at PM Narendra Modi and Andhra Pradesh CM Nara Chandrababu Naidu on special status to Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి