Ys Jagan: వరుస కేసుల వేళ జగన్ అనూహ్య నిర్ణయం-ఇక తేల్చేస్తారా ?
ఏపీలో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్ధితి అయిపోయిందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వైసీపీ జనాల్లోకి వెళ్లి పునర్ వైభవం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అధినేత జగన్ చేస్తున్న పర్యటనలకు మంచి స్పందన లభిస్తోంది. జగన్ కోసం జనాలు భారీగా తరలివస్తున్నారు. దీంతో సహజంగానే కూటమి సర్కార్ ఆత్మరక్షణలో పడుతోంది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య పేరుతో జగన్ ను నియంత్రించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై చర్చ జరుగుతోంది.
జగన్ తాజాగా చేసిన పల్నాడు టూర్ తో పాటు గతంలో చేసిన పొదిలి, గుంటూరు మిర్చియార్డ్ పర్యటనల్లోనూ లోపాల్ని వెతికి కేసులు పెట్టేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై ఈ ప్రభావం పడకుండా చూసుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు రేపు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైసీపీ రాష్ట్ర స్థాయి విసృత భేటీని ఏర్పాటు చేసారు.

జగన్ అధ్యక్షతన రేపు ఉదయం 10.30కు ఈ సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు పాల్గొనబోతున్నారు. ఇందులో టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన వైనం, ప్రతిపక్ష వైయస్సార్‌సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా సాగుతున్న కుట్రలు, దాడులపై చర్చిస్తారు.

ముఖ్యంగా ప్రభుత్వం సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండ గట్టాలని వైయస్సార్‌సీపీ భావిస్తోంది. ఈ దిశగా పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో ఈ భేటీలో తీసుకోబోయే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications