జగన్ జాతీయ జెండా ఆవిష్కరణ ఇలా, ప్రత్యేక హోదాపై నోరు విప్పిన బాలయ్య
హైదరాబాద్: 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటయోధుల చిత్రపటాలకు వైయస్ జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్యమంలో పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, రెండు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు.
హిందూపురంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బాలకృష్ణ
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆయన మాట్లాడుతూ ప్రజలందరు సోదర భావంతో మెలగాలని సూచించారు. హిందూపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన స్పీకర్ కోడెల
69వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పథంలో నడవాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆర్టీసీ ఎండీ సాంబశివరావు
69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని ఆర్టీసీ రీజియన్ ఆఫిసులో ఎండీ సాంబశివరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవల ప్రాముఖ్యతను తెలిపారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని ఆయన కోరారు
మంత్రి నారాయణ జెండా ఎగుర వేస్తుండగా అపశ్రుతి
నెల్లూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. జాతీయ జెండాను ఏపీ మంత్రి నారాయణ ఎగురవేస్తుండగా... జెండాకు ఉన్న తాడు తెగిపోయింది. దీంతో, మువ్వన్నెల పతాకం ఎగరకుండానే, కిందకు పడిపోయింది. ఊహించని ఘటనతో ఉలిక్కి పడిన అధికారులు, వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అనంతరం మంత్రి నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications