కేంద్రాన్ని అడ్డుపెట్టి చంద్రబాబుకు జగన్ సిసలైన సవాల్..! హైకోర్టు తీర్పుతో..!
ఏపీ స్దానిక సంస్ధల ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకుని జీవోలు కూడా ఇచ్చేసిన సీఎం చంద్రబాబుకు ఇవాళ హైకోర్టు వాటిని కొట్టేయడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు విమర్శలకు దిగారు. దీనిపై జగన్ (YS Jagan) ఘాటుగా స్పందించారు. బీసీలపై నయవంచనతో కూడిన రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారు? ఇంకా ఎన్నాళ్లు వారిని మభ్యపెట్టి మోసం చేస్తారంటూ జగన్ సూటిగా ప్రశ్నించారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు? సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల అది ఏ కోర్టులోనూ నిలబడదని కూడా మీకు తెలుసు? కోర్టులో నిలబడదని తెలిసీ, 44 రోజులుగా మీరు చేసింది కపట నాటకం కాదా? ఇవాళ మీరిచ్చిన జీవోలను కొట్టేస్తూ, హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీసీలకు క్షమాపణలు చెప్పి, లెంపలు వేసుకోండి అంటూ జగన్ సూచించారు. నిజంగా మీకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రంలో ఉన్న మీ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి ఆ మేరకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక మార్గాన్ని తీసుకొస్తే గాని, ఈ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరి ఆ దిశగా మీరు ఏం చేశారని జగన్ నిలదీశారు.

.@ncbn గారూ… మీరు బీసీలపై నయవంచనతో కూడిన రాజకీయాలు ఇంకా ఎన్నాళ్లు చేస్తారు? ఇంకా ఎన్నాళ్లు వారిని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ డ్రామా చేస్తున్నారని మీకూ తెలుసు? సుప్రీంకోర్టు గత తీర్పుల వల్ల అది ఏ కోర్టులోనూ నిలబడదని కూడా మీకు తెలుసు?…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2026
కేంద్రంతో మాట్లాడారా? కనీసం మీ కేంద్ర మంత్రులతో అక్కడి కేబినెట్ సమావేశాల్లో ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారా? మీరు ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్నిసార్లు దీనిపై కేంద్రంతో చర్చించారు? ఇవి చేయకుండా, చెల్లని జీవోలు ఇచ్చి డ్రామాలు చేయడం వెనుక మీ ఉద్దేశం, బీసీలను మభ్య పెట్టి, మోసం చేయాలనే కదా? రాజకీయ స్వార్థం కోసం మీ డ్రామాలు ప్రదర్శించడానికి బీసీలే కావాల్సి వచ్చారా? అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. బీసీలపై ప్రేమ మాటల్లో కాదు చంద్రబాబుగారూ... చేతల్లో చూపించాలన్నారు. తమ ప్రభుత్వంలో బీసీల కోసం కార్పోరేషన్ల ఏర్పాటు, పదవుల పంపకాలు, పథకాలు అమలు చేశామన్నారు.
తమ మాదిరి చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదన్నారు. కళ్లముందే బీసీలకు మేలు కలిగే చట్టం ఉన్నా ఎందుకు పట్టించుకోలేదు? ఇదీ బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి అని ఎద్దేవా చేశారు. బీసీల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు 34% రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన చర్యల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని, దీనికోసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నమీరు, అక్కడ మీ పరపతిని వాడి, కేంద్రాన్ని ఒప్పించి, చట్ట సవరణ ద్వారా 34% రిజర్వేషన్లు తీసుకురావాలని చంద్రబాబును జగన్ డిమాండ్ చేశారు.














Click it and Unblock the Notifications
