మీకు మీడియా పిచ్చి, దమ్ముందా: జగన్, బాబు ముసిముసి నవ్వు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీశాయి. జగన్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుకు మీడియా పిచ్చి ఉందన్నారు. బీజేపీ అన్యాయం చేసిందని చంద్రబాబు చెబుతున్నారని, అలాంటప్పుడు కేంద్ర కేబినెట్లో ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే టీడీపీ కేంద్ర కేబినెట్ నుండి బయటకు రావాలన్నారు.
మీ వాళ్లు ఇంకా మంత్రి పదవుల్లో ఎందుకున్నారని జగన్.. చంద్రబాబును ప్రశఅనించారు. దమ్ముంటే బీజేపీ మంత్రులను ఆయన బర్తరఫ్ చేయాలన్నారు. టీడీపీ వాళ్లకు ఏం చేతకాక తమ పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మీడియా పిచ్చి అన్నారు.
నాశనం చేసేందుకే: కామినేని
రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు జగన్ ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారని కామినేని శ్రీనివాస రావు అన్నారు. ప్రజలు అధికారం ఇవ్వలేదనే అక్కసుతో జగన్ మాట్లాడుతున్నారని చెప్పారు.

జగన్ చెబితే విడిపోం: విష్ణు కుమార్ రాజు
చంద్రబాబుకు మీడియాను ఫేస్ చేసే దమ్ముందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. జగన్ సలహా ఇస్తే తాము (టీడీపీ, బీజేపీ) విడిపోవడానికి సిద్ధంగా లేమన్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్యాయం చేయదని చెప్పారు. బీజేపీకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా మద్దతు పలికారన్నారు. మా మిత్ర బృందాన్ని చూసి కొందరు ఈర్షపడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము పొత్తు పెట్టుకున్నామని చెప్పారు.
ఏ పార్టీ అయినా రాష్ట్రాభివృద్ధి కోసం అందరం కలిసి పని చేద్దామన్నారు. రాష్ట్రానికి ఒక్క అన్యాయం జరిగినా బీజేపీ సభ్యులుగా తాము చూస్తూ ఊరుకోమని చెప్పారు.
జగన్ విమర్శలకు బీజేపీ, టీడీపీ సభ్యులు సమాధానం చెబుతుండగా... ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు.
డ్రామాలు: జగన్
టీడీపీ, బీజేపీ సభ్యులు కలిసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, వారి డ్రామా చూసేందుకు చాలా చక్కగా ఉందని జగన్ అన్నారు. ఓ వైపు బీజేపీ, టీడీపీలు బయటకు తిట్టుకుంటూ.. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయన్నారు. టీడీపీ కేంద్రంలో కలిసి ఉంటూనే.. బీజేపీతో అన్యాయం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ుందన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో బీజేపీ ఆనందంగా ఉంటుందని ఎద్దేవా చేశారు.
సభ్యులు మాట్లాడుతుంటే.. చంద్రబాబు చిత్రంగా నవ్వడం బాగుందని ఎద్దేవా చేశారు. ఈ డ్రామాను చూస్తుంటే ఎంత మంచి ఆర్టిస్టులో అనిపిస్తోందన్నారు. బీజేపీ అన్యాయం చేసిందని జగన్ ఎందుకు రావడం లేదని అనడం విడ్డూరంగా ఉందన్నారు. తాము ఏపీ కోసం మూడుసార్లు ఢిల్లీకి వెళ్లామని చెప్పారు.
మంత్రులను, ప్రధాని మోడీని కలిశామని చెప్పారు. తమ చేతుల్లో లేకపోయినప్పటికీ తాము ఢిల్లీకి వెళ్లామన్నారు. తాము చేయాల్సింది అంతా చేశామన్నారు. మీరే విమర్శలు చేసుకొని జగన్‌ను ఎందుకు అంటారన్నారు. ఎంత డ్రామా ఆడుతున్నారన్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ బాగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications