హైదరాబాద్‌లో కూలిన భవనం: ఏం చేస్తున్నారని.. చంద్రబాబు-కేసీఆర్‌లకు జగన్ ప్రశ్న
తెలంగాణ రాజధాని హైదరాబాదులోని నానక్‌రామ్‌గూడలో పన్నెండు రోజుల క్రితం భవనం కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను, గాయాలపాలైన వారి కుటుంబాలను జగన్ పరామర్శించారు.
విజయనగరం: తెలంగాణ రాజధాని హైదరాబాదులోని నానక్‌రామ్‌గూడలో పన్నెండు రోజుల క్రితం భవనం కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను, గాయాలపాలైన వారి కుటుంబాలను వైసిపి అధినేత వైయస్ జగన్ సోమవారం రాత్రి విజయనగరంలో పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మృతి చెందిన బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నానక్ రామ్ గూడ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విజయనగరం జిల్లాకు చెందిన చిలకలపల్లి వాసులు ఉన్నారు.

జగన్ ఓదార్పు
ఆయన సోమవారం రాత్రి చిలకలపల్లి వచ్చి, బాధిత కుటుంబీకులను ఓదార్చారు. పేద కుటుంబాలకు పూర్తిస్థాయిలో పరిహారం అందించకుండా ప్రచారం అయిపోయిందని చేతులు దులుపుకొంటే, అసెంబ్లీలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

రెండు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
బాధిత కుటుంబాలకు బిల్డరు నుంచి ఎలాంటి పరిహారం అందించకుండా రెండు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. తన పర్యటన ఖరారైందని తెలిసీ చంద్రన్న బీమా పథకం చెక్కులను బాధితులకు పంపిణీ చేశారే తప్ప, పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదన్నారు.

చంద్రబాబుకు లేఖ రాస్తా
బాధిత కుటుంబాలకు మరో రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని అందచేయాలన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాస్తానని తెలిపారు. ఉపాధి హామీ పనుల కల్పన, వలస నివారణలో విజయనగరం జిల్లా తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ముందంజలో నిలిచిందన్నారు.

వలసలు పెరిగాయి
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జిల్లా నుంచి వలసలు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వం కేటాయిస్తున్న ఉపాధి హామీ నిధులను పూర్తిగా వేతనదారులకు వినియోగిస్తే వలసలు నివారణకు అవకాశం ఉంటుందన్నారు.

హోదాపై చంద్రబాబు మీద నిప్పులు
అంతకుముందు, యువభేరీలో జగన్ మాట్లాడారు. హోదాతోనే ఉద్యోగాలు వస్తాయని, అందరం కలిసి హోదా సాధించుకుందామని అన్నారు. హోదా విషయంలో చంద్రబాబు ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్యాకేజీ, నిధుల పైన జైట్లీ, వెంకయ్య నాయుడులు అబద్దాలు చెబుతున్నారన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు కాకుండా రాష్ట్రానికి అదనంగా ఏం మేలు చేశారో బీజేపీ చెప్పాలన్నారు. హోదాను బీజేపీకి పణంగా పెట్టిన బాబు పైన టాడా కేసు పెట్టవద్దా అని నిలదీశారు. హోదా గురించి అడిగితే పీడీ కేసులు పెట్టడం విడ్డూరమన్నారు.












Click it and Unblock the Notifications