చంద్రబాబు- నారా లోకేష్ పనితీరుకు మార్కులు వేసిన జగన్
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో చోటు చేసుకున్న పరిణామాలు.. రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి.
దీనిపై తాజాగా- టెన్త్ పరీక్షల నిర్వహణలో చంద్రబాబు, నారా లోకేష్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. వారి అవివేక, అనాలోచిత, పరిణతి రహిత నిర్ణయాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు.

చంద్రబాబు పాలనలో విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని జగన్ ధ్వజమెత్తారు. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పరిచే పదో తరగతి పరీక్షల నిర్వహణే ఇలావుంటే మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థమౌతోందని అన్నారు.
రాష్ట్రంలో 6.14 లక్షల మంది విద్యార్థులు రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగన్ విమర్శించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను క్షోభకు గురి చేసిందని మండిపడ్డారు.
ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితిని తీసుకు వచ్చారని జగన్ చెప్పారు. ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా కళాశాలలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయం అయిపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని గుర్తు చేశారు.
చంద్రబాబు గారూ.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని నిలదీశారు జగన్. అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే ప్రభుత్వ బేలతనం బయటపడిందని అన్నారు. ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయని, అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.
మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను చంద్రబాబు.. అధికారంలోకి వచ్చీ రాగానే దెబ్బతీశారని జగన్ ఆరోపించారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దు చేశారని, ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమౌతున్నారని ఆందోళన వ్యక్తం చేశారాయన. చంద్రబాబు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదని, ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు.
తుది ఫలితాలు వెలువడేంత వరకూ పదో తరగతి మార్కుల ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపి వేయాలని జగన్ అన్నారు. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications