ఆ విషయం గుర్తుపెట్టుకో చంద్రబాబూ..!!
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
బీమా ప్రీమియం ఏదీ..
2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఉచిత పంట బీమా ప్రీమియం మొత్తాన్ని చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం ఇప్పటివరకూ చెల్లించ లేదనే విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఈ మొత్తం సకాలంలో విడుదల కాకపోవడం వల్ల రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

మేం ఆదుకున్నాం..
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని తమ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో చెల్లించే వాళ్లమని, నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నామని జగన్ అన్నారు. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశామని చెప్పారు.
కేంద్రం కూడా అప్పుడే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటా కూడా విడుదల చేస్తుందని వైఎస్ జగన్ అన్నారు. ఇది జరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుందని చంద్రబాబుకు వివరించారు.
54 లక్షల మందికి..
తమ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 7,802 కోట్ల రూపాయలను అందించి వారికి అండగా నిలిచామని జగన్ పేర్కొన్నారు. ఫలితంగా ఉచిత పంటల బీమా విషయంలో ఏపీ.. దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
ఎన్నికల కోడ్ వల్ల..
2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఉచిత పంటల బీమా ప్రీమియం విడుదల.. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయాయని, ఆ తరువాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. దాని గురించి పట్టించుకోవట్లేదని జగన్ విమర్శించారు.
నెల రోజులు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడం వల్ల కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదని జగన్ అన్నారు. ఇప్పటికే జూన్, జులై నెలలు గడిచిపోయాయని, ఆగస్టులో సగం రోజులు పూర్తికావొస్తున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేక పోవడం అత్యంత విచారకరమని అన్నారు.
.@ncbn … 2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదు. దీనివల్ల రైతులకు ఉచిత పంటలబీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 11, 2024
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్-మే నెలలో చెల్లించి…
పంటలు దెబ్బతినే ప్రమాదం..
ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరవు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చేయాలని డిమాండ్ చేశారు.
రూ. 20 వేలు ఏవీ..
అలాగే- పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సొమ్ము ఏటా 20,000 రూపాయలు చెల్లిస్తామని సూపర్ 6 హామీల్లో పేర్కొన్నారని, ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారని జగన్ పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తికావొస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా లేదని మండిపడ్డారు.
కోవిడ్ కాలంలోనూ..
కోవిడ్‌తో ప్రపంచ ఆర్థికవ్యవస్థలన్నీ కుదేలైనా క్రమం తప్పకుండా తమ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా నిధులను చెల్లించామని జగన్ చెప్పారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్‌లో రైతు భరోసా చెల్లించామని, ఈ విధంగా 53.58 లక్షల మంది రైతులకు 34,288 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం చేశామని అన్నారు.
బ్యాంకుల చుట్టూ రైతులు..
ఇప్పుడు మళ్లీ రైతులు పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ, వడ్డీ వ్యాపారులు చుట్టూ తిరిగే పరిస్థితులను చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందని జగన్ విమర్శించారు. వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు మీరు ఇస్తానన్న డబ్బులు సహా, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలని డిమాండ్ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications