కిరణ్ కుమార్ రెడ్డీ చేశారు, ఇప్పుడు రావట్లేదు: చంద్రబాబును ఏకేసిన జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు చంద్రబాబు ప్రభుత్వంపైన నిప్పులు చెరిగారు.
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు చంద్రబాబు ప్రభుత్వంపైన నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు సాగునీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండలో వైసిపి ధర్నా చేసింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.
అనంతపురం జిల్లా కరవు కాటకాలకు పుట్టినిల్లుగా ఉందన్నారు. గతంలోనూ చంద్రబాబు తొమ్మిదేళ్లు పరిపాలించారని, ఆయన ఈ ప్రాంతానికి కేటాయిస్తోన్న నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు.
ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదన్నారు. చంద్రబాబు ఎన్నికలున్నప్పుడల్లా ఈ ప్రాంతానికి వస్తున్నారని అనంతరం అనంతపురాన్నే మరచిపోతున్నారని విమర్శించారు.

ఇదే ఉరవకొండ వద్దకు వచ్చి గతంలో చంద్రబాబు ఎన్నో హామీలు కురిపించారన్నారు. ఇక్కడ హంద్రీనీవా ప్రాజెక్టుకు ఎన్నడో శంకుస్థాపన చేశారని, ఇప్పటికీ ఇదే ప్రాజెక్టుకి రెండు సార్లు శంకుస్థాపన చేశారన్నారు.
ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి, ఇక ఇక్కడి ప్రజలతో, హంద్రీనీవా ప్రాజెక్టుపై తనకేం పని అని చంద్రబాబు అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. హంద్రీనీవా కోసం ఎన్నో ఏళ్ల నుంచి పోరాటాలు జరుగుతున్నాయన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే హంద్రీనీవాకు నిధుల కేటాయింపు జరిగిందన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి కాదని, ముఖ్యకంత్రీ అని ధ్వజమెత్తారు. 2012లోనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారని చెప్పారు. వాటన్నింటిని ప్రజలు మరిచిపోతారనుకొని కొత్తగా వచ్చి చంద్రబాబు రిబ్బన్ కంటింగ్ చేస్తారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications