‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’: బాబు పాలనపై ప్లీనరీ వేదికగా జగన్ నిప్పులు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై పార్టీ ప్లీనరీ వేదికగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పాలన ఎప్పుడు పోతుందా? అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పార్టీ ప్లీనరీ వేదికగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పాలన ఎప్పుడు పోతుందా? అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబుపై 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు వైయస్ జగన్. ఈ పుస్తకాన్ని ప్రతీ గ్రామంలోకి తీసుకెళ్లాలని జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు రూ. 3.75లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఒక్క అమరావతిలోనే రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు.

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర
నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న 12ఎకరాల స్థలంలో ఈ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోన్యాసం చేశారు. అంతకుముందు వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ఆయన పేదవాడికి ఎప్పుడూ అండగా నిలిచారని తెలిపారు.

తేడా తెలుసు
రాజన్న రాజ్యం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని వైయస్ జగన్ చెప్పారు. వైయస్సార్ పాలనకు, చంద్రబాబు పాలనకున్న తేడా ప్రజలకు తెలుసని అన్నారు. మనం చాలా మంది ముఖ్యమంత్రులను చూశామని, కానీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నది వైయస్సార్ మాత్రమేనని జగన్ తెలిపారు.

బాబు పాలన దుర్మార్గమే
చంద్రబాబు పాలన దుర్మార్గంగా, అన్యాయంగా సాగుతోందని మండిపడ్డారు.
ప్లీనరీలో ఎవరైనా తమ సలహాలను, సూచనలను పార్టీ నాయకులకు ఇవ్వవచ్చని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రతీ తీర్మానం కలిసికట్టుగా చర్చించి ఆమోదించుకుందామని అన్నారు.

పోలీసు భద్రత కూడా ఇవ్వలేదు..
ఇంత పెద్ద సమావేశం జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పోలీసు భద్రత ఏర్పాటు చేయలేదన్నారు. మనమంతా క్రమశిక్షణగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందామని అన్నారు. రేపు(ఆదివారం) తన సుదీర్ఘ ప్రసంగం ఉంటుందని చెప్పారు. ప్లీనరీలో సుమారు 20 తీర్మానాలు చేయబోతున్నామని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని ప్లీనరీలో పాల్గొన్న నేతలందరూ ప్రతిజ్ఞ చేశారు.

వైయస్‌కు నివాళి
అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 68వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ఉన్న వైయస్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ, షర్మిల, భారతి, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిలు ఘన నివాళి అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ విగ్రహానికి జగన్ పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. వారందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు.












Click it and Unblock the Notifications